దిల్దార్..షహర్
విభిన్నం
భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనం భాగ్యనగరం. ఎక్కడి నుంచి వచ్చిన వారికైనా ఆత్మీయంగా ఆతిథ్యం ఇవ్వడమే మన నగర సంస్కృతి. అందుకే చాలామందికి హైదరాబాద్ సొంతిల్లులా మారింది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం విదేశీయులు ఇక్కడకు క్యూకడితే.. ఇప్పుడు చదువుల కోసం విదేశీ విద్యార్థులు ఇక్కడకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 78 దేశాల విద్యార్థులకు మన నగరం విజ్ఞానకేంద్రంగా విలసిల్లుతోంది. నగరంలో దాదాపు 9,800 మంది విదేశీ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే నాలుగువేల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలను కాదని విదేశీ విద్యార్థులు చదువుల కోసం హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలా వచ్చిన కొందరు విదేశీ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీలో ‘సిటీప్లస్’ పలకరించగా, హైదరాబాద్‌లో తమ అనుభవాలను, అనుభూతులను ఆనందంగా పంచుకున్నారు.
..:: ప్రవీణ్‌కుమార్ కాసం
తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య ...
మొదటిచూపులోనే హైదరాబాద్ నచ్చేసింది. ఇక్కడి భాష రాకపోతే చాలా ఇబ్బందులొస్తాయనుకున్నా. కానీ, ఇక్కడ అందరూ రెండుమూడు భాషలు మాట్లాడుతున్నారు. ఏదైనా అడ్రస్ అడిగితే చాలా ఓపికగా చెబుతారు. ఓ.యూ.లో బీసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ప్రస్తుతం టోలీచౌకీలో ఉంటున్నాను. ఇక్కడికొచ్చి ఏడాదవుతోంది. చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందేది హైదరాబాద్‌లోనే. - హుసామ్( లిబియా)
ఆతిథ్యం బాగుంటుంది..
హైదరాబాద్ నగరం రోమ్లా ఫ్యాషన్‌గా ఉండకపోవచ్చు. కానీ, ఇక్కడ ఆతిథ్యం చాలా బాగుంటుంది. ఇతరులను ఎలా గౌరవించాలో ఇక్కడి వారిని చూసి నేర్చుకోవాలి. ప్రస్తుతం ఓయూలో కలినరీ ఆర్ట్స్‌లో పీజీ చేస్తున్నా.
ఇటాలియన్ ఫుడ్ కంటే ఇక్కడి బిర్యానీ, తందూరీ రోటీలే నాకు బాగా నచ్చాయి. లేడీస్ కూడా చాలా సేఫ్‌గా ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇక్కడికొచ్చి ఏడు నెలలవుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ర్యాగింగ్ లాంటివి ఎక్కడా కనిపించలేదు. చార్మినార్‌లో గాజులు బాగున్నాయి. వాటిని నా ఫ్రెండ్సకి గిఫ్ట్‌గా తీసుకెళ్తున్నా. - షియారా ఓనిస్ (ఇటలీ)
ఇక్కడి ప్రజలు చాలా సాఫ్ట్
బీకాం కంప్యూటర్స్ చదువుతున్నా. ఇక్కడ లెక్చరర్స చెప్పే పాఠాలు మొదటి సంవత్సరం అర్థం కాలేదు. ఇప్పుడు ఫర్వాలేదు. భారత్‌లో అన్ని నగరాలకు వెళ్లా. కానీ, హైదరాబాద్‌లో వాతావరణం బాగుంటుంది. ఢిల్లీలోలా మాదిరిగా మరీ చలిగా ఉండదు. జైపూర్‌లో ఉన్నంత ఎండలూ ఉండవు. ఇక్కడి ప్రజలు కూడా చాలా సాఫ్ట్. సిటీబస్‌లో నిలబడితే చాలా మంది పిలిచి మరీ సీటు ఇస్తుంటారు.
- ఒకెటుండే అల్యుతెమ్ (నైజీరియా)
హైదరాబాదీలు కొత్త వాళ్లతో కలసిపోతారు
హైదరాబాదీలు కొత్త వాళ్లతో చాలా త్వరగా కలసిపోతారు. ఎక్కడి నుంచి వచ్చిన వారైనా
ఈ వాతావరణంలో తేలిగ్గా అడ్జస్ట్ అయిపోతారు. మా దేశంలో ఎక్కడికి వెళ్లినా తిరగి వస్తామన్న గ్యారంటీ లేదు. ఇక్కడ మాత్రం చాలా సేఫ్‌గా ఎక్కడికైనా వెళ్లొచ్చు. కాకుంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ. హైదరాబాద్ బిర్యానీ నా ఫేవరెట్ ఫుడ్. నెలకోసారైనా ఫ్రెండ్సతో ప్యారడైజ్‌కు వెళ్తుంటా. - హయతుల్లా హమాదీ (అఫ్ఘ్ఘానిస్థాన్)
తెలుగు సినిమాలు బాగుంటాయి
ఇక్కడ అందరూ సహకరిస్తారు. మా వాళ్లు చాలామంది ఇక్కడ ఉన్నారు. మా దేశంలాగే కనిపిస్తుంది. ఇక్కడ గోల్కొండ, చార్మినార్.. అన్ని చూశా. ముఖ్యంగా శిల్పారామం అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే మరీ ఇష్టం. హీరోలు భలే ఫైట్స్ చేస్తుంటారు. అవన్నీ ఫన్నీగా అనిపిస్తుంటాయి. - తన్వీర్, సౌదీ అరేబియా
- నగరంలోని మొత్తం ఫారిన్ స్టూడెంట్స్
- సుమారుగా 9,800
- గతేడాది ఉస్మానియా వర్సిటీ పరిధిలో స్టూడెంట్స్ - 4,000
- ఫారిన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండేది
- టోలీచౌకీ, మెహదీపట్నం
- ఎక్కువ ఫారిన్ స్టూడెంట్స్ వస్తున్నది
- ఆఫ్రికన్, సౌదీ దేశాల నుంచి
- 78 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు
- 2-దేశంలో విదేశీ విద్యార్థులు అత్యధికంగా గల నగరంలో హైదరాబాద్ స్థానం (మొదటి స్థానం పుణే)