భారీ క్యారీబ్యాగ్‌తో గిన్నిస్‌లోకి
సాక్షి, ముంబై: కేవలం 9.02 గంటల వ్యవధిలో 21/27 పర్యావరణ అనుకూల అడుగుల క్యారీబ్యాగ్‌ను తయారు చేసిన ఠాణే మహిళ మనీషా ఓగ్లే గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఈమే చేసిన ఈ పనిని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు కూడా గుర్తించి సర్టిఫికెట్ జారీ చేశారు. 2013, ఏప్రిల్‌లో ఠాణేలోని కోరమ్ మాల్లో ఈ భారీ క్యారీబ్యాగ్‌ను తయారు చేయడమే కాకుండా దానిపై పర్యావరణ అనుకూల సందేశాలను రాసి ఈ ఘనత సాధిం చారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, చెట్లను కాపాడుకోవాలని, మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వినియోగాన్ని తగ్గించుకోవాలని తన కళ ద్వారా చాటి చెప్పారు.
గిన్నిస్బుక్వారు, లిమ్కాబుక్వారు అందజేసిన సర్టిఫికెట్లను మనీషా మీడియాకు చూపారు. ఈ సందర్భంగా మనీషా ఓగ్లే మాట్లాడుతూ.. లిమ్కా, గిన్నిస్ బుక్‌లో తనకు చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. తన కల నెరవేరేందుకు మంచి అవకాశం లభించిందన్నారు. నా సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన కోరమ్‌మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కోరమ్‌మాల్ జనరల్ మేనేజరు దేవా జ్యోతుల మాట్లాడుతూ.. ఓగ్లే సాధించిన ఈ రికార్డుల కారణంగా తమ మాల్‌కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇదివరకు ఠాణే జిల్లాకే పరిమితమైన పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిందన్నారు. పర్యావరణానికి మేలుచేసే కార్యక్రమం కావడంతో తామం తా సహకరించామని చెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు కోరమ్‌మాల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
ఠాణే జిల్లాకు చెందిన 35 ఏళ్ల మనీషా ఓగ్లే ఎనిమిదేళ్లుగా ఈ కళారంగంలో ఉన్నారు. ఆమె వద్ద అనేక రకాల పెయింటింగులు ఉన్నాయి. అందులో ఆమెకు నచ్చింది ఫ్యాబ్రిక్ పెయింటింగ్. మధుబని పెయింటింగ్, వార్లీ పెయింటింగ్‌లో కూడా నైపుణ్యత సాధించారు. చీర, కుర్త, దుపట్టాలపై ఇజిప్టు స్టైల్లో వేసిన డిజైన్లు కొనుగోలుదారులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
ఆమె ఇటీవల చీరపై వేసిన డిజైన్‌కు దుబయిలో మంచి గుర్తింపు లభించింది. తన కళ ద్వారా ముంబై, ఠాణేలో అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆమె కళా నైపుణ్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలు టీవీలో ప్రసారమయ్యాయి. గతంలో 40/20 అడుగుల భారీ కుర్తాను 29.27 గంటల్లో సిద్ధం చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకెక్కారు.