రూ.2 కోట్లయినా కొనేసే ‘టైమ్’ ఇది!
♦ లిమిటెడ్ ఎడిషన్ వాచీలపై పెరుగుతున్న మోజు
♦ గణనీయంగా పెరుగుతున్న మహిళల శాతం
♦ కంపెనీలన్నీ స్మార్ట్‌వాచీల తయారీలోకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెండు కోట్లు పెడితే బ్రహ్మాండమైన ఇల్లొస్తుంది. ఇంకాస్త లగ్జరీకి పోయేవాళ్లకైతే... చక్కటి కారొస్తుంది. మరి అంతకన్నా లగ్జరీని ఆశించేవాళ్లయితే..? ఓ వాచీ వస్తుంది. ఒమెగా, బుల్గారీ, పియాజెట్, బ్రుగీ, ఉర్విక్.. ఇలా కంపెనీ ఏదైతేనేం!! లిమిటెడ్ ఎడిషన్ అయితే చాలు... భారత్‌లో రూ.2 కోట్ల వరకూ వెచ్చించే సంపన్నులూ ఉన్నారు మరి. వజ్రాలు పొదిగిన, ప్లాటినం, బంగారంతో తయారైన ఈ ఖరీదైన వాచీలను ఇష్టపడని వారు లేరంటే అబద్ధమేమీ కాదు. రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారులు, ఇతర సంపన్నులు వీటికి అతిపెద్ద కస్టమర్లు. అయితే వీటి అమ్మకాలే వాచీలో ముల్లుల్లాగా సెలైంట్‌గా జరుగుతూ ఉంటాయి. విక్రయించిన కంపెనీగానీ, కొనుక్కున్న కస్టమర్ గానీ ఈ విషయాన్ని వెల్లడించడానికి ఇష్టపడరు. రూ.10 లక్షలు, ఆపైన ఖరీదు చేసే ‘ప్రెస్టీజ్’ వాచీలు భారత్‌లో ఏటా 300పైనే అమ్ముడవుతున్నాయంటే ఆశ్చర్యమనిపించక మానదు.
ఇదీ వాచీల విపణి..
దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత రంగంలో వాచీల విక్రయ పరిమాణం రూ.6,000 కోట్లుంది. అవ్యవస్థీకృత రంగంలోనూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. విస్తృతి 3 శాతమే. అంటే 100 మందిలో ముగ్గురికే వాచీ ఉంటోంది. అదే అంతర్జాతీయంగా చూస్తే ఇది 20-25%. వ్యవస్థీకృత రంగ విపణిలో రూ.10,000 లోపు ధర ఉన్న వాచీల వాటా 65 శాతం. రూ.10,000-రూ.1 లక్ష విభాగం 20 శాతం, రూ.1 లక్ష ఆపైన వాచీల పరిమాణం 15 శాతం ఉంది. 15 ఏళ్ల క్రితం రూ.5 వేల లోపు ధర ఉన్న వాచీల వాటా ఏకంగా 99 శాతం ఉండేది. కువైట్‌లో అయితే ఒక్కొక్కరు 10-20 వాచీలను కలిగి ఉంటారట.
ఆ వాచీ పెట్టుకుంటే... అదో ప్రెస్టీజ్ మరి
రూ.10 లక్షలు ఆపైన ధరలో ఉండే వాచీలను ప్రెస్టీజ్ విభాగం కింద పరిగణిస్తున్నారు. ఈ విభాగంలో ఏటా దేశంలో 300 వాచీలు అమ్ముడవుతున్నాయట. ఆదాయపు పన్ను, భద్రత సమస్యల వల్ల విక్రేతలు, కస్టమర్లు వీటిని బయటకు వెల్లడించ టానికి ఇష్టపడటం లేదు. లిమిటెడ్ ఎడిషన్లలో చేతితో చేసిన ఒక్కో వాచీ తయారీకి ఆరు నెలలు పడుతోంది. కాగా, గతంలో దీపావళికే వాచీల అమ్మకం ఉండేది. ఇప్పుడు 365 రోజులూ గిరాకీ ఉంటోంది. మొత్తం వాచీల అమ్మకాల్లో టాప్-30 నగరాల వాటా 80%.
కలర్‌ఫుల్ కాపర్..
రాగి(కాపర్) వర్ణంతో తయారైన వాచీలకు మహిళలు మక్కువ చూపుతున్నారు. ఆ తర్వాత వైన్ వర్ణం, తెలుపు రంగుల వాచీలకు గిరాకీ ఎక్కువ. మగ వారి విషయంలో స్టీలు, రోజ్ గోల్డ్ కలర్స్‌కు క్రేజ్ ఉంది. వ్యాపారులైతే చేతికి రోజ్ గోల్డ్ కలర్ వాచీ ఉండాల్సిందేనంటున్నారు. దక్షిణాదిన ఈ రంగు వాచీలకు మంచి ఆదరణ ఉంది. మూడేళ్ల క్రితం వరకు అమ్ముడైన వాచీల్లో పురుషులు ధరించేవి 90%, స్త్రీలవి 10% ఉండేవి. ఇప్పుడు స్త్రీల వాచీల వాటా 30 శాతానికి ఎగసింది. మహిళలూ ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తుండడమే ఈ స్థాయి అమ్మకాలకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. నిజానికి హైదరాబాద్ కస్టమర్లు వాచీల విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తారట. బ్రాండ్, విలువకే తొలి ప్రాధాన్యమిస్తారని జస్ట్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ మేనేజర్ మనోజ్ సుబ్రమణియన్ చెప్పారు. ఢిల్లీ, గుజరాత్‌లలో డిస్కౌంట్లే మార్కెట్‌ను నడిపిస్తాయని చెప్పారాయన.
స్మార్ట్‌వాచీలు సైతం..
సంప్రదాయ వాచీల తయారీ కంపెనీలు లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా స్మార్ట్ వాచీలను ప్రవేశపెడుతున్నాయి. కస్టమర్లు బ్రాండ్‌ను కోరుతుండటంతో కంపెనీలు వీటిని తయారు చేయాల్సిందేనని మనోజ్ అన్నారు. స్విట్జర్లాండ్, హాం కాంగ్, యూఎస్‌లో వాచీలు తయారవుతున్నాయి. భారత్‌లోనూ కొన్ని కంపెనీలు తయారీలోకి ప్రవేశించాయి. ఇవి రూ.35 వేలలోపు విభాగానికే పరిమితమయ్యాయి. కస్టమర్లు చౌక వాచీలనే ఆన్లైన్లో కొంటున్నారు. కొందరు విక్రేతలు నకిలీలను ఆన్లైన్లో అమ్ముతున్నారు. అసలుకి, నకిలీకి పెద్దగా తేడా ఉండడం లేదన్నది మార్కెట్ వర్గాల మాట. వీటి సర్వీసింగ్ అతిపెద్ద సమస్య.
రోజుకి 400 వాచీలు..
వాచీల విక్రయంలో ఉన్న జస్ట్ లైఫ్‌స్టైల్ దేశవ్యాప్తంగా 30 నగరాల్లో 55 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. పంజాగుట్ట సెంట్రల్లో షాప్ ఇన్ షాప్‌ను ఏర్పాటు చేసింది. ఆస్పెన్ పేరుతో ప్రధానంగా మహిళల కోసం వాచీలను అంతర్జాతీయ స్థాయిలో తయారు చేసి భారత్‌తోపాటు పలు దేశాల్లో విక్రయిస్తోంది. 2017 డిసెంబర్‌కల్లా హైదరాబాద్‌లో 5 స్టోర్లతో సహా మొత్తం 45 కేంద్రాలను ప్రారంభించనుంది. ఒక్కో స్టోర్‌లో 3 వేలకుపైగా వెరైటీలు కొలువుదీరాయి. ప్రస్తుతం రోజుకు 400 వాచీలను విక్రయిస్తోంది. జస్ట్వాచెస్.కామ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ వాచీలను అమ్ముతోంది.