ఫేస్‌బుక్‌తో తగ్గుతున్న హైరింగ్ భారం
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 వేల మందికి ఉద్యోగాలివ్వనున్నది. ఇప్పటికే 25 వేల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చామని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు. టైర్-వన్, టైర్-టూ నగరాల నుంచే ఈ సారి హైరింగ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక హైరింగ్ విషయంలో ఫేస్బుక్, లింక్డెన్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వలన తమపై భారం తగ్గుతోందని వివరించారు. వీటి ద్వారా నేరుగా అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటున్నామని, ఫలితంగా ఇతర నియామక ఏజెన్సీలపై ఆధారపడడం తగ్గుతోందని తెలిపారు.
మూణ్నెళ్లలో కొలువులే... కొలువులు: మ్యాన్‌పవర్ సర్వే
కాగా వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడటంతో భారత కంపెనీలు భారీగా ఉద్యోగాలివ్వనున్నాయి. రానున్న మూడు నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలు జోరుగా చేపట్టాలని ఆ కంపెనీలు యోచిస్తున్నాయని ప్రముఖ హెచ్ఆర్ సంస్థ మ్యాన్‌పవర్ రూపొందించిన ద మ్యాన్‌వపర్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. మొత్తం 5,389 కంపెనీలపై నిర్వహించిన ఈ తాజా సర్వే వివరాలు..,
- స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడి ఇప్పటికే కొన్ని రంగాల్లో హైరింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
- జూలై-సెప్టెంబర్ కాలానికి భారీ స్థాయిలోనే ఉద్యోగాలివ్వగలమని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే హైరింగ్ అవుట్‌లుక్ 46 శాతం అధికంగా ఉంది.
- భారత్, తైవాన్, టర్కీ, న్యూజిలాండ్, సింగపూర్ కంపెనీలు ఉద్యోగ కల్పన పట్ల పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల కంపెనీలు మాత్రం ఏమంత ఆశావహంగా లేవు.