‘నదుల అనుసంధానం’ సభ్యుడిగా శ్రీరాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కలల ప్రాజెక్టు అయిన ‘నదుల అనుసంధానం’ ప్రాజెక్టు త్వరగా సాకారమయ్యేందుకు వీలుగా ‘టాస్క్ ఫోర్స్’ కమిటీని కేంద్ర జలవనరుల శాఖ మంగళవారం ఏర్పాటుచేసింది. ఇందులో సభ్యుడిగా తెలుగు ప్రముఖుడు శ్రీరాం వెదిరె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా బీఎన్ నవాలావాలా నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం అమెరికాలో ఓ కంపెనీలో 15ఏళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2009లో భారత్‌కు తిరిగొచ్చారు. నీరు పారుదలపై అనేక రచనలు చేశారు. బీజేపీలో చేరిన ఆయన పార్టీ వాటర్ మేనేజ్మెంట్ సెల్ జాతీయ కన్వీనర్‌గా విధులు నిర్వర్తించారు.
ఏకాభిప్రాయం కోసం కృషి
శ్రీరాంను టాస్క్‌ఫోర్స్ విధులపై ‘సాక్షి’ ప్రశ్నించగా పలు విషయాలు వివరించారు. ‘దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఈ కమిటీ పనిచేస్తుంది. నదుల అనుసంధానాకి సంబంధించి కొత్త లింకులను అధ్యయనం చేస్తుంది. ఇబ్బందులున్న చోట ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తుంది. సమగ్ర , సాధ్యాసాధ్యాల నివేదికలతోపాటు ప్రాజెక్టు పూర్తికి షెడ్యూలు ఇస్తుంది’ అని అన్నారు.