భారత మిలియనీర్ల విదేశీ బాట..
గత 14 ఏళ్లలో 61 వేల మంది వలస
న్యూఢిల్లీ : భారతీయ మిలియనీర్లు విదేశాలకు అధికంగా తరలివెళ్తున్నారు. ఇతర దేశాలకు తరలివెళ్లే మిలియనీర్ల పరంగా చూస్తే.. చైనా అగ్రస్థానంలో (91,000) ఉంటే, భారత్ రెండో స్థానంలో (61,000) ఉంది. వీటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (42,000), ఇటలీ (23,000), రష్యా (20,000), ఇండోనేసియా (12,000), దక్షిణాఫ్రికా (8,000), ఈజిప్ట్ (7,000) ఉన్నాయి. గత 14 ఏళ్లలో దాదాపు 61,000 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు తరలివెళ్లారు. ఇలా మిలియనీర్లు విదేశాలకు తరలి వెళ్లడానికి పన్నులు, భద్రత, పిల్లల విద్య తదితర అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలు న్యూ వరల్డ్ వెల్త్, ఎల్‌ఐఓ గ్లోబల్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయ్యాయి.
భారత మిలియనీర్లు ఎక్కువగా యూఏఈ, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లిపోతున్నారు. అలాగే చైనా మిలియనీర్లు కూడా అమెరికా, హాంగ్‌కాంగ్, సింగపూర్, యూకే దేశాలకు అధికంగా తరలిపోతున్నారు. మొత్తంగా చూస్తే.. మిలియనీర్ల గమ్యస్థానంగా యూకే కొనసాగుతోంది. గత 14 ఏళ్లలో దాదాపు 1.25 లక్షల మంది మిలియనీర్లు ఇతర దేశాల నుంచి యూకేకు వెళ్లిపోయారు. యూకే వెళ్లే మిలియనీర్ల సంఖ్య యూరప్, రష్యా, చైనా, భారత్ నుంచే అధికంగా ఉంది. మిలియనీర్లను ఆకర్షించడంలో యూకే తర్వాతి స్థానాల్లో అమెరికా, సింగపూర్ ఉన్నాయి. చైనా మిలియనీర్లు అధికంగా అమెరికాకు వెళ్లిపోతున్నారు. అలాగే సింగపూర్‌కు వెళ్లే మిలియనీర్లు చైనా, భారత్, ఇండోనేసియా నుంచి అధికంగా ఉన్నారు.