పులులే కాదు.. సింహాలూ చంపేస్తున్నాయి!
సాధారణంగా ఎక్కడైనా పులులు మనుషులను చంపి తింటాయి. కానీ, గుజరాత్‌లోని గిర్ అడ వులలో అత్యంత అరుదైన ఘటన జరిగింది. ఏడేళ్ల అబ్బాయిని, ఓ మహిళను సింహాలు చంపి తినేశాయి. ఈ రెండు మరణాలు వేర్వురు ఘటనలలో గుజరాత్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు. 2010లో గిర్ అడవుల్లో 411 సింహాలు మాత్రమే ఉండగా, 2015 నాటికి వాటి సంఖ్య 523కు పెరిగింది.
గిర్-సోమనాథ్ జిల్లాలోని మలియా హతినా తాలూకాలో గల బాబ్రా విర్ది గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల వయసున్న రోహిత్ అనే అబ్బాయి తన తండ్రి రుమల్ ఆదివాసితో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఓ మగసింహం దాడిచేసింది. రోహిత్‌ను సింహం అడవిలోకి లాక్కెళ్లిపోవడంతో అతడి తండ్రి సాయం కోసం అరిచాడు. సమీప గ్రామస్తులు వెంటనే వచ్చి అడవిలోకి వెళ్లినా.. అప్పటికే సింహం ఆ పిల్లాడిని చంపేసి ముక్కలు చేసేసింది. ఆ సింహం మ్యాన్ ఈటర్‌గా మారుతుందన్న భయంతో, అటవీ శాఖాధికారులు తర్వాత దాన్ని పట్టుకున్నారు.
మరో సంఘటన జునాగఢ్ జిల్లాలోని భేసన్ తాలుకా సమత్పరా గ్రామంలో జరిగింది. అక్కడ హన్సాబెన్ ధమేచా (45) అనే మహిళ గ్రామం బయట కట్టెలు కొట్టుకుని తెచ్చుకోడానికి వెళ్లినప్పుడు ఆమెపై సింహం దాడి చేసింది. ఆమెను సమీపంలోని పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా సింహాలను ఎవరైనా రెచ్చగొడితే తప్ప అవి మనుషుల మీద దాడులు చేయవని, ఇది చాలా అరుదని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఏపీ సింగ్ తెలిపారు.