బోర్డియక్స్ మెట్రోతో సర్కార్ ఒప్పందం
- పట్టణాభివృద్ధి, శాస్త్రసాంకేతిక, మద్యం ఉత్పత్తిలో పరస్పర సహకారం
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలు, మద్యం తయారీ పరిశ్రమలో పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవడానికి ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ నగర పాలక సంస్థ(మెట్రో పొలిస్), తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, బోర్డియక్స్ ఉపాధ్యక్షుడు మిచెల్ వెర్నేజోల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని సీఎం కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలి పింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎస్ రాజీవ్ శర్మ గత వారం రోజులుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలసి ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి బోర్డియక్స్ పట్టణం మద్యం ఉత్పత్తికి కేంద్రంగా పేరుగాంచింది.
తెలంగాణ రాష్ట్రం- బోర్డియక్స్ మధ్య పలు రంగాల్లో ఆర్థిక బంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ ఎంఓయూ జరిగిందని సీఎంఓ కార్యాలయం తెలిపింది. గత నెలలో బోర్డియక్స్ను సందర్శించిన ప్రభుత్వ సలహాదారుడు బీవీ పాపారావు అంశాల వారీగా సహాయ, సహకారాలు అందించుకునే విధంగా ముసాయిదా ఒప్పంద పత్రం రూపకల్పన విషయంలో అక్కడి ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. పట్టణాభివృద్ధి, పట్టణ రవాణా, నీటి నిర్వహణ- మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి అంశాల్లో సహకారంతో పాటు ఏరో నాటికల్ ఇంజనీరింగ్, ఐటీ, బయో టెక్నాలజీ, మద్యం పరిశ్రమ రంగాల్లో ఆర్థిక సహకారం అందిపుచ్చుకోడానికి ఈ ఒప్పందం జరిగింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా సీఎస్ రాజీవ్ శర్మ బోర్డియక్స్లోని ‘ఏరో క్యాంపస్ క్విటైన్ అండ్ సబీన టెక్నాలజీస్’ సంస్థను సందర్శించి పెట్టుబడుల సాధ్యాసాధ్యాలపై చర్చలు జరి పారు. అనంతరం స్టాక్‌హోంలోని ఎలక్ట్రోలక్స్, ఎరిక్సన్ కంపెనీలతో సమావేశాలు జరిపారు. స్వీడన్లో ఐకియా పరిశ్రమను సందర్శించారు.