స్కూల్‌బస్సుల్లో పిల్లల జాబితా !
తప్పని సరి చేయనున్న ఆర్టీఏ
నేడు పాఠశాల యాజమాన్యాలతో సమావేశం
సాక్షి,సిటీబ్యూరో: స్కూళ్లు, కాలేజీలకు నడిచే బస్సుల్లో ఇక నుంచి పిల్లలు (విద్యార్థులు) జాబితా తప్పనిసరి కానుంది. ఆ బస్సులో ప్రతి రోజు రాకపోకలు సాగించే పిల్లల పేర్లు, తరగతి, పాఠశాల/ కాలేజీ పేరు, చిరునామా వం టి వివరాలను తప్పనిసరిగా బస్సు లోపల జా బితా రూపంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. పై గా డ్రైవర్లు, సహాయకులు, ఆ రూట్లో నడిచే బస్సులను తరచుగా మార్చడానికి వీల్లేకుండా కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు ఆర్టీఏ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు పాఠశాల యాజమాన్యాల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 6,527 స్కూల్, కళాశాలల బస్సులున్నాయి. ప్రస్తుతం వీటిలో చాలా బస్సుల నిర్వహణ అడ్డగోలుగా ఉంది. విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లపై చూపుతున్న శ్రద్ధ వాటి నిర్వహణ పైన చూపడం లేదు. పైగా శని, ఆదివారాలు, వరుస సెలవులు, వేసవి సెలవులు వస్తే చాలు పిల్లల బస్సులను పెద్దల రవాణా కోసం వినియోగిస్తూ రహదారి భధ్రతా నిబంధనలకు విఘాతం కలిగిస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస్సుల్లో పిల్లలు మాత్రమే పయనించాలనే ప్రాథమిక నిబంధన కూడా అమలుకు నోచుకోవడం లేదు.పైగా ప్రతి రోజు రాకపోకలు సాగించే స్కూల్ బస్సుల్లో, ఏ బస్సులో ఏ పిల్లలు ఉన్నారో, ఎంతమంది ప్రయాణిస్తున్నారో, వారి పేర్లేంటే తెలియదు. మరోవైపు కొన్ని పాఠశాల యాజమాన్యాలు తరచుగా బస్సులను డ్రైవర్లను మార్చడం కూడా వాటి నిర్వహణలో ఇబ్బందికరంగా మారుతోంది.
ఇక ఎప్పటికప్పుడు కొత్తగా విధుల్లో చేరే డ్రైవర్లు, సహాయకుల వల్ల వారికి పిల్లలతో ఎలాంటి అనుబంధం ఏర్పడటం లేదు. కొంతమంది పిల్లల గమ్యస్థానాలు కూడా సరిగ్గా తెలియని డ్రైవర్లు, సిబ్బంది ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనుభవజ్ఞులైన డ్రైవర్లు, సహాయకులు ఒకే రూట్లో స్థిరంగా పని చేసేవిధంగా మార్పులు తీసుకురావాలని ఆర్టీఏ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నేతృత్వంలో ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.