విమాన ఇంధన రేట్ల తగ్గింపు
12.5% తగ్గిన ఏటీఎఫ్ ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు అయిదేళ్ల కనిష్టానికి తగ్గిన నేపథ్యంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్), సబ్సిడీయేతర వంట గ్యాస్ (ఎల్పీజీ) ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. ఏటీఎఫ్ ధరను 12.5 శాతం, ఎల్పీజీ రేటును సిలిండరుకు రూ. 43.50 మేర తగ్గించినట్లు, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంస్థలు గురువారం ప్రకటించాయి.
దీంతో ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ రేటు రూ. 7,520.52 తగ్గి రూ. 52,422.92కి దిగి వచ్చింది. అలాగే 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర రూ752 నుంచి రూ. 708.50కి తగ్గినట్లవుతుంది.విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 40 శాతం వాటా ఏటీఎఫ్లదే ఉంటుంది.
ఎయిర్‌లైన్స్‌కి తాజా పరిణామం ఊరట కలిగించనుంది. మరోవైపు, ఏటీఎఫ్ ధరలను తగ్గించడాన్ని విమానయాన సంస్థలు స్వాగతించాయి. అయితే, విమాన ప్రయాణ చార్జీలను తక్షణమే తగ్గించే యోచనేదీ లేదని స్పష్టం చేశాయి. నిర్వహణ వ్యయాలు చాలా అధికంగా ఉన్నందున ఏటీఎఫ్ రేట్ల తగ్గింపు ఎయిర్‌లైన్స్‌కి ఊరటనిచ్చే చర్యని స్పైస్‌జెట్ సీవోవో సంజీవ్ కపూర్ తెలిపారు.