liter milk
-
లీటరు పాలు..81 మంది విద్యార్థులకు
సోన్‌భద్ర: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఎంత దారుణంగా అమలవుతుందో తెలిపే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా చోపన్ బ్లాక్‌లోని కోటా గ్రామ పంచాయతీలో ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సలాయి బన్వా ప్రాథ మిక పాఠశాలలో 81 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి రోజూ మధ్యాహ్నం గ్లాసు పాలు అందించాల్సి ఉంటుంది. పాఠశాల నిర్వాహకుడు (శిక్షామిత్ర)మాత్రం లీటరు పాలు తెప్పించి, వాటిని బకెట్ నీళ్లలో కలిపి ఒక్కో విద్యార్థికి అరగ్లాసు చొప్పున అందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగన్ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల నుంచి వివరాలను తెలుసుకుని ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మిర్జాపూర్ జిల్లా సియూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఒక మహిళ రొట్టెలు, మరో మహిళ ఉప్పు పంచుతున్న వీడియో ఒకటి ఆగస్టులో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా అధికారులు అప్పట్లో హడావుడి చేశారు. -
ఆ పాలు.. లీటరు రూ. 6 వేలు
అనపర్తి: కాలం మారింది. గాడిదను ఓ అల్పజీవిగా, ఓ తిట్టుపదంగా మాత్రమే పరిగణించే రోజులకు కాలం చెల్లింది. ‘కడివెడైననేమి ఖరము పాలు’ అన్న మాటనూ మార్చుకోవలసి వస్తోంది. మరి.. గాడిద పాలకు పెరిగిన గిరాకీ అలా ఉంది. ఆ గిరాకీ ఎంత అంటే లీటరు రూ.6 వేల వరకు రేటు పలికేటంత. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన కొందరు అనపర్తికి బుధవారం సుమారు 80 ఆడ గాడిదలను తోలుకు వచ్చారు. వాటిని సంపన్నుల వాకిళ్ల ముందుకు తీసుకు వెళ్లారు. ఇంతకీ విషయమేమిటంటే.. గాడిద పాలు తాగితే ఉబ్బసం, అజీర్తి, కీళ్ల నొప్పులు వంటి పలు రోగాలు మటుమాయమవుతాయన్న నమ్మకంతో పలువురు ఆ పాల కోసం ఎగబడ్డారు. దీంతో గిరాకీ పెరిగి లీటరు రూ.6 వేలకు అమ్మారు. ఒక్కో గాడిద రోజుకోసారి 200 నుంచి 250 మిల్లీ లీటర్లు మాత్రమే పాలు ఇవ్వడంతో బుధవారం పాలు దొరకని వారు మర్నాడు పాలు తమకే ఇచ్చేలా అడ్వాన్సు కూడా చెల్లించారు. అజీర్తి, ఉబ్బసంతో బాధపడేవారికి గాడిద పాలు మంచి ఔషధమని గాడిదల పెంపకందారుడు మాచర్ల కాలయ్య చెప్పారు. అనేక చోట్ల లీటర్లు రూ.2 వేల వరకూ పలుకుతుండగా అనపర్తిలో ఏకంగా రూ.6 వేల వరకూ పెరగడం విశేషం.