ఇదేం పద్ధతి..!?
♦ ముఖ్యమంత్రి సభకు రైతుల తరలింపు బాధ్యత అధికారులకు..
♦ ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
♦ పోలీసుల ఆంక్షలతో ట్రాఫిక్ కష్టాలు
పామర్రు/ పెదపారుపూడి/ రెడ్డిగూడెం :
ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రైతులను భారీ సంఖ్యలో తీసుకురావాలని అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో మండలస్థాయి అధికారులు గ్రామస్థాయిలోని వీఆర్వోల వైపు చూశారు. అంతే వారు నయానో భయానో రైతులను తహసీల్దార్ కార్యాలయం వరకు తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి బస్సుల్లో వారిని కార్యక్రమం జరిగే ప్రాంతానికి తరలించారు. రవాణా ఖర్చుల భారం కూడా కిందిస్థాయి ఉద్యోగులపైనే మోపినట్లు సమాచారం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ఇలా వాడుకోవడంపై పలువురు ఇదేం పద్ధతి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామర్రు నుంచి రెండు బస్సులు, పెదపారుపూడిలో ఒక బస్సులో అతికష్టంపై రైతులను అధికారులు తరలించారు.
సీఎం సభలో పోలీసుల అత్యుత్సహం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షాలు విధిస్తూ అత్యుత్సహం ప్రదర్శించారు. దీంతో అక్కడకు చేరుకున్న రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులను సైతం జలహారతి, సభ ప్రాంగాణానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం సభను విజయవంతం చేయడానికి రెండు జిల్లాల పరిధిలోని 9 నియోజకవర్గాల్లోని రైతులు, ప్రజలను అధికార పార్టీ నాయకులు ఇక్కడకు తరలించారు. సీఎం సభ ప్రాంగణం తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేయడంతో కొంత మందిని రోడ్లపైనే నిలుపుదల చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం ట్రాఫిక్ కారణంగా ద్విచక్ర వాహనంపై సభ వేదిక వద్దకు చేరుకున్నారు.
జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జలహారతి, సభ వేదిక వద్దకు స్థానిక జర్నలిస్టులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఆర్వో జారీ చేసిన పాసులు ఉన్నప్పటికీ పోలీసులు లెక్కచేయలేదు. ఈ క్రమంలో జర్నలిస్టులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. చివరకు పోలీసులు అనుమతించారు.