‘చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం’
అనంతపురం టౌన్ : జిల్లాలోని నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. డ్వామా హాల్లో శనివారం చేనేత కార్మికుల సమస్యలపై టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ఉన్న 10,115 మంది చేనేతలకు రూ.36.42 కోట్ల రుణమాఫీకి అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. చంద్రన్న బీమాపై అవగాహన కల్పించాలన్నారు. సెప్టెంబర్ నుంచి ముద్ర రుణాలు అందించనున్నట్లు చెప్పారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ఆగస్టు 6న ముఖ్యమంత్రి ధర్మవరంలో పర్యటిస్తారన్నారు. పవర్లూమ్స్ ద్వారా తయారయ్యే వస్తువులను తయారీ కేంద్రంలోనే సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే సూరి మాట్లాడుతూ నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అనంతరం ధర్మవరం నియోజకవర్గంలో అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా కింద ప్రీమియంను తానే చెల్లిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, ఎల్డీఎం జయశంకర్, సెరికల్చర్ జేడీ అరుణకుమారి, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు.