'అదితి మరణంపై కోర్టులో పిల్'
విశాఖ: క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న అదితి విగతజీవిగా మారిపోవడంపై పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ చిన్నారి అదితి మృతిపై మండిపడుతోంది. బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ నిర్లక్ష్యం, ఆక్రమణదారులే చిన్నారి అదితిని పొట్టనపెట్టుకున్నాయని మండిపడ్డారు. అదితి దుర్మరణంపై కోర్టులో పిల్ దాఖలు చేస్తానని ఆయన అన్నారు.
మరోవైపు ఈనెల 4వ తేదీన ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి గల్లంతై విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో విగతజీవిగా మారినన ఆరేళ్ల చిన్నారి అదితి అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీంతో కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతం. ముఖ్యంగా కన్నతల్లి కడుపుశోకం గుండెల్ని పిండేసింది. ఏ సంబంధమూ లేకపోయినా నగరమంతా తరలివచ్చింది. ఎక్కడో ఒకచోట క్షేమంగా తిరిగి వస్తుందనుకున్నామని అందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా ఎనిమిది రోజులుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని నిరీక్షించిన వారికి.. ఈ ఘటన తీరని గుండెకోతను మిగిల్చింది. చిన్నారి అదితి కానరాని లోకాలకు తరలి వెళ్లి అందరిలోనూ విషాదాన్ని నింపింది.