రుణ-డిపాజిట్ నిష్పత్తిని తొలగించిన చైనా
బీజింగ్: మందగమన ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్న చైనా... ఈ దిశలో శనివారం మరో కీలక అడుగు వేసింది. బ్యాంకింగ్‌లో రుణ-డిపాజిట్ రేషియో 75 శాతం పరిమితిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో బ్యాంకులు తమ డిపాజిట్ల నిధులను పరిమితి లేకుండా రుణాలు అందించడానికి వినియోగించుకోవచ్చు. అంటే బ్యాకింగ్ వద్ద ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) మరింత పెరుగుతుందన్నమాట. ఆ మేరకు 1995 నుంచీ అమలవుతున్న కమర్షియల్ బ్యాంక్ చట్ట సవరణను చైనా చట్టసభ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ఆమోదించింది.
కాగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా 2015 సంవత్సరానికి స్థానిక ప్రభుత్వాల రుణాలపై పరిమితులనూ విధించింది. ఈ పరిమితి 16 ట్రిలియన్ యువాన్ (2.505 ట్రిలియన్ డాలర్లు)గా ఎన్పీసీ నిర్ణయించింది. షేర్లలోకి కోట్లాది నిధుల కుమ్మరింపు, కరెన్సీ విలువ తగ్గింపు, వడ్డీరేట్లు, రిక్వైర్మెంట్ రిజర్వ్ రేషియోల కోత వంటి పలు చర్యలను ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చైనా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చైనా మందగమనం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై చూపుతోంది.