మాఫియర్
- బ్యాంకర్లు, రెవెన్యూ మధ్య కొరవడిన సమన్వయం
- రైతన్నలకు శాపం ... వీడని ఉత్కంఠ
- 7న బ్యాంకర్ల సమ్మె, 8వ తేదీనే ఆఖరు గడువు
- రెండో దశపై ఆశలు లేనట్టేనా..?
ఒంగోలు: తొలి సంతకంతోనే రైతుల బతుకుల్లో వెలుగులు నింపుతానని సీఎం చంద్రబాబు ప్రకటించి ఆరు నెలలు దాటినా రైతుల గుండెల్లో గుబులు ఇంకా రెట్టింపవుతూనే ఉంది. సమాచారం అసమగ్రంగా ఉందంటూ 2,27,398 మంది రైతుల ఖాతాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నా ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. రెండోదశలో ఉన్న వారి పేర్లను రుణమాఫీ వెబ్సైట్లో పెట్టే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన భరోసా రైతుల్లో సాంత్వన చేకూర్చలేకపోతోంది.
సమగ్ర సమాచారాన్ని సేకరించి వెబ్సైట్లో పొందుపరచాలని ఓ వైపు చెబుతూ మరో వైపు జన్మభూమి కమిటీలతో సర్టిఫై చేయించి అప్లోడ్ చేయాలంటూ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అవలంబించడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి బ్యాంకర్లలో నెలకొంది. జన్మభూమి కమిటీల్లో ఎవరో ఒకరు సంతకం చేస్తే చాలు ఆ వివరాలను అప్లోడ్ చేస్తామంటూ బ్యాంకర్లు చెబుతున్నా రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకర్ల మధ్య సమన్వయ లోపం దాదాపు రెండు లక్షల మంది రైతులకు శాపంగా పరిణమించనుంది.
సోమవారం నాటికి అప్లోడ్ అయిన ఖాతాల సంఖ్య కేవలం 25,072 మాత్రమే. అంటే ఇంకా అప్లోడ్ కావాల్సిన ఖాతాల సంఖ్య 2,02,326 మిగిలి ఉన్నాయి. ఈనెల 7వ తేదీన బ్యాంకర్లు సమ్మెలోకి వెళుతుండడం, 8వ తేదీన వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు చివరిరోజు కావడంతో రైతులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు.
ఉలవపాడు, హనుమంతునిపాడు మండలాల రైతులకు సంబంధించి ఇంతవరకు ఒక్క రుణఖాతా కూడా అప్లోడ్ కాకపోగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 520 బ్రాంచీలకుగాను 240 బ్రాంచీలలో సోమవారం నాటికి కనీసం ఒక్క ఖాతా కూడా అప్లోడ్ కాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.