ఉత్తుత్తి ఉత్పత్తులతో రూ.28 కోట్లు స్వాహా
కాకినాడ దేనా బ్యాంక్‌లో భారీ కుంభకోణం
ధర్మవరం ఆగ్రో కోల్డ్‌స్టోరేజీ తనిఖీలో బయటపడిన వైనం
పరారీలో కోల్డు స్టోరేజీ యజమాని
ప్రత్తిపాడు :
కోల్డ్ స్టోరేజీలో ఖాళీ పెట్టెలను వ్యవసాయ ఉత్పత్తులుగా చూపి మాయ చేసి, కోట్లు కొట్టేసిన ఘరానా దోపిడి ఇది. రైతులను నిలువునా ముంచి, వారి పేరనే రూ.కోట్లు నొక్కేసిన కోల్డు స్టోరేజీ యజమాని మాయాజాలమిది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.28 కోట్లు స్వాహాచేసినట్టు బ్యాంకు అధికారుల తనిఖీలో వెల్లడైంది. ధర్మవరం గ్రామంలో జాతీయ రహదారిని చేర్చి 20 ఏళ్ల క్రితం సాయిభ్య ఆగ్రో కోల్డ్ స్టోరేజీని కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్ నెలకొల్పారు. ఈ స్టోరేజీ లో రైతులు చింతపండు, మిర్చి, మామిడి రసం, పత్తి విత్తనాలు, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం, గిట్టుబాటు ధర వచ్చినపుడు విక్రయించడం జరుగుతోంది. స్టోరేజీలో ఉన్న సరుకులపై బ్యాంకుల నుంచి రైతులు రుణాలు పొందడం సహజమే. ఇదే తరహాలో కోల్డు స్టోరేజీలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను చూపి, రైతులు కాకినాడ దేనాబ్యాంకు నుంచి రుణాలు పొందారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, గొల్లప్రోలు, ఏలేశ్వరం, అయినవిల్లి, పిఠాపురం, కాకినాడ, తాళ్లరేవు, కిర్లంపూడి తదితర మండలాలతో పాటు విశాఖ, ఖమ్మం జిల్లాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 111 మంది రైతులు కాకినాడ దేనా బ్యాంకు నుంచి రుణాలు పొందారు. 2013–14, 2014–15లతో పొందిన రుణాల చెల్లింపు సక్రమంగా జరగడంతో బ్యాంకు అధికారులు 2015–16లో రూ. 27,57,55,000 రుణాలు అందించారు. అయితే రుణాన్ని తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యం జరగడంతో బ్యాంకు అధికారులు సాయిభ్య ఆగ్రో కోల్డు స్టోరేజీలో తనిఖీలు చేపట్టగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండాల్సిన చెక్కపెట్టెలో వేరుశెనగ తొక్కలు, చెక్కపొట్టు గమనించి అధికారులు నిర్ఘాంతపోయారు. దీంతో దేనా బ్యాంకు మేనేజర్ ఎ¯ŒS.నరసింహ ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రుణగ్రహీతల్లో బినామీలే అధికం
కోల్డ్ స్టోరేజీలో వ్యవసాయ ఉత్పత్తులపై రుణాలు పొందిన వారిలో బినామీలే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్మికులను సైతం రైతులుగా చూపి, సాయిభ్య ఆగ్రో స్టోరేజీ యజమాని వెంకట సత్యప్రసాద్ బ్యాంకు నుంచి రుణాలు పొందినట్టు తెలుస్తోంది.
బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతోనే
బ్యాంకు అధికారులు తీరు కూడా సొమ్ము స్వాహాకు దోహదపడింది. కోల్డు స్టోరేజీలో ఉన్న చింతపండు, మిర్చి, తాండ్ర, పత్తి విత్తనాలు తదితర ఉత్పత్తులను కనీసం పరిశీలించకుండానే రుణం మంజూరు చేసినట్టు తెలుస్తోంది. దీన్నే సాకుగా తీసుకుని వెంకట సత్యప్రసాద్ చెక్క పొట్టు, వేరుశెనగ తొక్కలతో చెక్కపెట్టెలను నింపి, స్టోరేజీలో భద్రపరిచారు.
లోతుగా దర్యాప్తు : సీఐ శ్రీనివాసరావు
ధర్మవరం సాయిభ్య ఆగ్రో కోల్డు స్టోరేజీ యాజమాని కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్‌తో పాటు 111 మంది రైతులపై కేసు నమోదు చేసినట్టు ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్యాంకును మోసం చేసి, రుణం పొందినట్లు అందిన ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేపడతామన్నారు. కోల్డ్ స్టోరేజీని సీజ్ చేశామన్నారు.