ఎన్నికైనా.. ఎదురుచూపులే
ఇదో వింత అనుభవం..
ఎన్నికైనా పదవీ ప్రమాణం ఆలస్యం
ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్లకు తప్పని నిరీక్షణ
జూన్ 2న ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణం
ఆ తర్వాతే మిగిలిన వారు...
మంత్రి పదవుల కోసం నేతల యత్నాలు
సాక్షి, మచిలీపట్నం : వరుసగా జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన ప్రక్రియ వల్లే ఈ చిత్రమైన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్లో 59 మంది కార్పొరేటర్లుగా, మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో 218 మంది వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు.
మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగిన స్థానిక సమరంలో 836 మంది ఎంపీటీసీలు, 49 మంది జెడ్పీటీసీలు విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఇద్దరు ఎంపీలుగా, 16 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి విజేతలుగా నిలిచినా... వీరంతా వెంటనే పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం లేకుండాపోయింది.
2న ఎమ్మెల్యే, ఎంపీల ప్రమాణ స్వీకారం...
జిల్లాలో ఎంపీలుగా ఎన్నికైన కొనకళ్ల నారాయణరావు, కేశినేని నాని, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మండలి బుద్ధప్రసాద్, ఉప్పులేటి కల్పన, కొల్లు రవీంద్ర, కాగిత వెంకట్రావు, కామినేని శ్రీనివాస్, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, మేకా ప్రతాప్ అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల ప్రభాకరరావు, శ్రీరాం తాతయ్య, బోడె ప్రసాద్, జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌రావులు జూన్ రెండో తేదీన, లేకుంటే ఆ తరువాత రోజుల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తిరుపతిలో చేస్తామని చంద్రబాబు తొలుత ప్రకటించారు. ఇప్పుడు విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాతే జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు పీఠం ఎక్కేందుకు మరో 12 రోజులకు పైగా ఎదురుచూపులు తప్పవు మరి.
అమాత్య పదవుల కోసం.. ఎవరి ప్రయత్నాలు వారివే...
మరోపక్క కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కీలక పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఏర్పాటుచేసి ఒకటి కాపులకు, మరొకటి బీసీలకు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరతామని, రెండు కేబినెట్, మరో రెండు సహాయ మంత్రులను కోరుతామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చేరితే రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ మంత్రి పదవిని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జిల్లాలోని కీలక నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండలి బుద్ధప్రసాద్ రెండు రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైకి మర్యాదపూర్వకంగా కలిసినట్టు బుద్ధప్రసాద్ చెబుతున్నా ఉప ముఖ్యమంత్రి పదవికి సిఫారసు కోసమేనని పలువురు అంటున్నారు.
కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో తనకే అవకాశం దక్కేలా పవన్‌తో ఒత్తిడి చేయించేందుకే బుద్ధప్రసాద్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వినికిడి. మరోవైపు జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావులకు అవకాశం వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. వారు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
బీజేపీ నుంచి కామినేని ముమ్మర యత్నాలు
బీజేపీకి రాష్ట్ర మంత్రివర్గంలో చేరే అవకాశం వస్తే కామినేని శ్రీనివాస్ ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు తన బంధువర్గం, సామాజిక వర్గంతో పావులు కదుపుతున్నట్టు సమాచారం. సీమాంధ్ర బీజేపీ పక్ష నేతగా ఎన్నిక కానున్న ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చేరితే సహాయ మంత్రి పదవి కోసం బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు కీలక నేతతో పావులు కదుపుతున్నట్టు సమాచారం. మరి.. అమాత్య పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.