ప్రీమియంకన్నా రాబడి తక్కువైతే?
ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో నేను నెలకు రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. మరో 8-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను సరైన ఫండ్స్‌నే ఎంచుకున్నానా? - అవంతిక, విశాఖపట్టణం
మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కొన్ని ఫండ్స్ రేటింగ్స్ ఇటీవల కాలంలో పడిపోయాయి. అయినా ఎలాంటి ఢోకా లేదు. అవి మంచి పనితీరు కనబరుస్తున్న ఫండ్స్ అనే చెప్పవచ్చు. హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్లో ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనువైనది కాదని చెప్పవచ్చు. దీనికి బదులుగా ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫండ్‌ను పరిశీలించవచ్చు.
నేను 2009లో భారతీ ఆక్సా బ్రైట్ స్టార్ ప్లాన్‌ను తీసుకున్నాను. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంది. దీనికి రూ.20,716 చొప్పున మూడేళ్ల పాటు, 2012, సెప్టెంబర్ వరకూ ప్రీమియం చెల్లించాను. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఫండ్ వాల్యూ ఎంత ఉందోనని చెక్ చేశాను. నేను చెల్లించిన ప్రీమియం అంత కూడా లేదు. ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? - పరశురామ్, హైదరాబాద్
భారతీ ఆక్సా బ్రైట్ స్టార్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది సగం బీమా, సగం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కొత్త యులిప్ నిబంధనలకు ముందు వచ్చిన పాలసీ ఇది. దీంతో ఈ ఫండ్ చార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. ఫలితంగా మీకు నష్టాలొచ్చాయి. ప్లాన్ బ్రోచర్‌ను పరిశీలించినట్లయితే, పాలసీ కాలపరిమితిని బట్టి ప్రీమియం కేటాయింపు చార్జీ 40 శాతం వరకూ ఉంటుంది. దీనర్థం మీరు ప్రీమియం చెల్లించగానే 40 శాతం కంపెనీకి వెళ్లిపోతుంది. మిగిలిన మొత్తాన్ని బీమా, ఇన్వెస్ట్మెంట్ విభాగాలకు కేటాయిస్తారు. ప్రీమియం కేటాయింపు చార్జీలే కాకుండా పాలసీ నిర్వహణ చార్జీలు, ఫండ్ నిర్వహణ చార్జీలు, తదితర చార్జీలు ఉంటాయి. వీటన్నింటి కారణంగా ఈ ఫండ్ రాబడులు తక్కువ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ పాలసీకి లాకిన్ పీరియడ్ మూడు సంవత్సరాలు. మీరు పాలసీ ప్రారంభమైన మొదటి మూడు సంవత్సరాలకు ప్రీమియమ్‌లు చెల్లించారు కాబట్టి, మీరు స్వేచ్ఛగా ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు. సరెండర్ చార్జీలు మినహాయించుకొని మీకు రావలసింది వెనక్కి ఇస్తారు. పాలసీ కాలపరిమితి, ఏ సంవత్సరంలో సరెండర్ చేశారన్న అంశాలపై సరెండర్ చార్జీలు ఆధారపడి ఉంటాయి. 7, 10 సంవత్సరాల కాలపరిమితి పాలసీలకు ఎలాంటి సరెండర్ చార్జీలుండవు. పాలసీ కాలపరిమితి పదేళ్లకు మించి ఉంటే సరెండర్ చార్జీ 3 శాతంగా ఉంటుంది. ఏతావాతా మీ పాలసీని సరెండర్ చేయడం మంచిది. సరైన మొత్తానికి టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో కాకుండా వార్షికంగా ప్రీమియమ్‌ను చెల్లించండి. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్ ఇవి... హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ. అంతేకాకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను కూడా పరిశీలించవచ్చు.
అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద ఎల్ఐసీ సంస్థ ప్రతీ నెలా నా యూనిట్లలో కోత విధిస్తోంది. ఇలా నా యూనిట్లను తగ్గించడం చట్టరీత్యా సమంజసమేనా? ఈ అడ్మినిస్ట్రేషన్ చార్జీలను ఎలా వదిలించుకోవాలి? -సర్వేశ్వరరావు, అనంతపురం
ఈ పాలసీ తీసుకునేటప్పుడు మీరు పాలసీ బ్రోచర్‌ను, డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవలేదని తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్ చార్జీల వివరాలను వీటిల్లో ఎల్ఐసీ స్పష్టంగా పేర్కొంది. పాలసీ డాక్యుమెంట్ ప్రకారం.., పాలసీ తీసుకున్న మొదటి ఏడాది నెలకు రూ.60 చొప్పున, ఆ తర్వాతి సంవత్సరాల్లో పాలసీ కాలపరిమితి పూర్తయ్యేవరకూ నెలకు రూ.20 చొప్పున అడ్మినిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తారు. ఇది చట్టబద్ధమే. పాలసీ అమల్లో ఉన్నంత వరకూ వీటిని చెల్లించాల్సిందే.