Locked House Monitoring System
-
ఇంటికి తాళం.. ఎల్‌హెచ్‌ఎంఎస్‌దే భారం..!
సెలవులు, బంధువుల ఇళ్లలో శుభకార్యాల సమయంలో చాలామంది బయట ఊర్లకు వెళ్లాల్సి వచ్చినపుడు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోతుంటారు. సాయంత్రం వెళ్లి.. ఉదయం తిరిగొచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో దొంగలు వారి హస్తకళను ప్రదర్శిస్తున్నారు. ఉన్నదంతా ఊడ్చేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఉచితంగా మన ఇంటిపై ఓ కన్నెసి ఉంచడానికి ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో సిద్ధంగా ఉన్నామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. సాక్షి, చిత్తూరు (అర్బన్): తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలను అరికట్టడానికి పోలీసు శాఖవారు జిల్లాలో రెండేళ్ల క్రితం ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రారంభించారు. అయి తే ఇప్పటికీ చాలా మంది దీన్ని ఉపయోగించుకోవడం లేదు. పోలీసులు ఇంటింటా తిరుగు తూ ప్రతి ఒక్కరూ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఉచితంగా వాడుకోమని వేడుకుంటున్నా.. కొందరు చెవికెక్కించుకోవడం లేదు. ఫలితంగా ఈ మధ్యకాలంలో చిత్తూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. దొంగలుపడ్డ ఆర్నెల్లకు పోలీసులు మేల్కొంటారనే నానుడిని చెరిపేస్తూ.. దొంగలు రాగానే పోలీసులు పట్టుకుంటున్నారనే పేరు తీసుకురావడానికి పోలీసు శాఖ ప్రయత్నిస్తున్నా.. ప్రజల సహకారం లేకపోతోంది. తాళం వేసిన ఇళ్లలో దొంగలు పడ్డ నిముషాల వ్యవధిలో వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఎల్‌హెచ్‌ఎంఎస్ డౌన్లోడ్ ఇలా.. ముందుగా స్మార్ట్ ఫోన్ నుంచి గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి. ఇక్కడ ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్’ అని టైప్ చేయాలి. ఏపీ పోలీస్ పేరిట ప్రత్యక్షమయ్యే ఓ అప్లికేషన్ కనిపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత వ్యక్తి పేరు, ఫోన్ నంబరు, చిరునామాతో పాటు ఇంట్లో కూర్చుని గూగుల్ మ్యాప్‌ను అటాచ్ చేయాలి. వెంటనే మనం ఇచ్చిన ఫోన్ నంబరుకు నాలుగంకెల వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీన్ని యాప్‌లో టైప్‌చేస్తే మన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత మన ఫోన్ నంబరుకు ఓ రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. దీన్ని ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. ఇక ఎప్పుడైనా ఊరికి వెళుతున్నపుడు పోలీసులు ఇంటిపై నిఘా ఉంచాలనుకుంటే.. యాప్‌లోకి వెళ్లి ‘రిక్వెస్ట్ పోలీస్ వాచ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తరువాత యూజర్ ఐడీ అడుగుతుంది. గతంలో సెల్‌ఫోన్‌కు వచ్చిన సంఖ్యను టైప్ చేయాలి. మనం ఎప్పుడు ఊరికి వెళ్లేది, సమయం, తిరిగి వచ్చే తేదీ, సమయం టైప్ చేసి సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి. ఇలా పనిచేస్తుంది.. సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్ పూర్తయిన తరువాత ఇంటికి పోలీసు కానిస్టేబుల్ వస్తారు. ఇంట్లో ఆలౌట్ మిషన్‌ను పోలి ఉండే ఓ మోషన్ కెమెరాను బిగించిన తరువాత మనం ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవచ్చు. అప్పటి వరకు కెమెరా పనిచేయదు. ఎప్పుడైతే దొంగ లోనికి ప్రవేశిస్తాడో ఆ కదలికల ద్వారా కెమెరా ఆన్ అవుతుంది. ఒక్కసారి కెమెరా ఆన్ కాగానే జిల్లా ఎస్పీకు, కమాండెంట్ కంట్రోల్ గదిలో అనుసంధానం చేసిన టీవీలోకి లైవ్ ప్రత్యక్షం అవుతుంది. అలారమ్ ద్వారా బ్లూకోట్ పోలీసుల నుంచి ఎస్పీ వరకు అలెర్ట్ చేస్తుంది. ఇక నేరుగా పోలీసులు వచ్చి దొంగను పట్టుకెళుతారు. ఒక వేళ ఇంటి యజమాని సైతం దీన్ని చూడాలనుకుంటే పోలీసులు దానికి తగ్గ ఆప్షన్‌ను ఇస్తారు. ఇందుకు కావాల్సిన కెమెరాలు రాష్ట్ర పోలీసు శాఖ నుంచి అందుతాయి. ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. స్పందించాలి మరి.. చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 2016లో 53,993 మంది వారి ఇళ్లకు తాళాలు వేసుకుని బయట ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒక్కరు కూడా పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారమివ్వలేదు. 2017లో 1.10 లక్షల మంది, 2018లో 85,671 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40వేలకు మందికి పైగా ఇళ్లకు తాళం వేసినా పోలీసులకు ఎలాంటి సమాచారమివ్వలేదు. ఇదే సమయంలో గత మూడేళ్లుగా 17,850 మంది ఎల్‌హెచ్‌ఎంఎస్ కోసం రికెస్ట్ పెడితే... వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఉచితంగా కెమెరాలను ఏర్పాటు చేయడం గమనార్హం. -
దొంగల పాలిట యమపాశం
పశ్చిమగోదావరి : వ్యక్తిగత పనులపై ఊరు విడిచి వెళ్తున్నారా?.. ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందా? రెండు, మూడు రోజులు ఇంటికి దూరంగా ఉంటున్నారా? అయితే జర జాగ్రత్త.. అదను కోసం వేచిచూసే దొంగలకు అవకాశం ఇచ్చినట్లే.. మీ ఇల్లు, సొత్తు భద్రంగా ఉంటుందనే భరోసా మీకుందా ? దొంగల భయం ఉంటే.. వెంటనే మీ సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసు అధికారులను సంప్రదించండి. మీ ఇల్లు, ఇంట్లోని సొత్తును భద్రంగా రక్షించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. దొంగల పాలిట యమపాశంలా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్) అందుబాటులో ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం విధానంతో దొం గల భరతం పట్టే అవకాశం మీచేతుల్లోనే ఉంటుంది.–ఏలూరు టౌన్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్లను దొంగల బారి నుంచి కాపాడుకోవటంతో పాటు, నేరగాళ్లను సులువుగా పట్టుకోవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన వారు ప్లే స్టోర్ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఈ యాప్‌లోకి వెళ్లిన అనంతరం మీ చిరునామా, వివరాలన్నీ నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకూ ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని లక్షా పదివేల మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఏలూరులోనే 24 వేల మంది ఉండగా, త్రీటౌన్ పరిధిలో 12 వేల మంది, వన్‌టౌన్ పరిధిలో 7 వేల మంది, టూటౌన్ పరిధిలో 5 వేల మందికి పైగా నమోదు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సేవలను పోలీస్ శాఖ ఉచితంగా అందిస్తోందని, పోలీస్ కంట్రోల్ రూంలో ఎస్సై స్థాయి అధికారి ఈ విధానాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా దొంగ ఇంటిలోకి ప్రవేశించి కెమెరాకు కనిపించగానే వెంటనే పోలీసులను అలర్ట్ చేస్తుంది. యాప్ కలిగిన ఇంటి యజమాని సైతం తన మొబైల్లో ఇంటి వద్ద పరిస్థితులను చూసుకునే అవకాశం ఉంది. దొంగ దొరికిపోయాడు ఇలా ఈ ఏడాది మార్చి నెలలో ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనవివరాలు... ఏలూరు సత్రంపాడు ఐటీఐ కాలేజీ వెనుక ప్రాంతంలో తాడేపల్లిగూడెం కోర్డు ఉద్యోగి వైఎల్ఎన్ మూర్తి నివాసం ఉంటున్నారు. మూర్తి తన కుటుంబంతో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి దర్శనార్థం వెళ్తూ.. పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన లాక్డ్ హౌస్ మానటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2018 మార్చి 29న త్రీటౌన్ పోలీసులకు తాను తిరుపతి వెళ్తున్నట్టు సమాచారం ఇచ్చారు. త్రీటౌన్ ఎస్సై పైడిబాబు ఆధ్వర్యంలో ఆ టెక్నాలజీలో శిక్షణ పొందిన కానిస్టేబుల్ మూర్తి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేశారు. ఈ విధానంలో సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావటంతో పాటు, ఎవరైనా తాళాలు పగులగొడితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూంలో అలారం మోగుతుంది. 2018 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక దొంగ ప్రవేశించి, లోపల ఏమి ఉన్నాయో వెతుకుతూ ఉన్నాడు. 12.31 నిమిషాలకు పోలీస్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 12.37 నిమిషాలకు త్రీటౌన్ ఎస్సై ఎ.పైడిబాబు, కానిస్టేబుల్ సతీష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే సందర్భంలో వాహనాల శబ్దాలు వినిపించటంతో దొంగ ఇంటి నుంచి బయటకు వచ్చి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దొంగను వెంబడించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి చోరీలకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అనుకూలమైన సమయాన్ని చూసుకుని, ఇళ్లలో యజమానులు లేని సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటారు. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు శాఖ అమలు చేస్తోన్న ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను వినియోగించుకుంటే మంచిది. ప్రజల సొత్తుకు రక్షణతో పాటు నేరగాళ్ల ఆట కట్టించే అవకాశం ఉంటుంది. ప్రజల్లో చైతన్యం వస్తే దొంగతనాలను నిలువరించే అవకాశం ఉంటుంది.–ఎన్ రాజశేఖర్, ఏలూరు త్రీటౌన్ సీఐ చోరీలకు చెక్ పెట్టొచ్చు దొంగతనాలు నిలువరించాలంటే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను వినియోగించాలి. ఊరు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందిస్తే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ యాప్‌కు అనుసంధానం చేయటంతో పాటు, పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ఏదైనా చోరీ జరిగితే వెంటనే దొంగలను పట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. నేరాలను నిరోధించేందుకు ఇదొక అస్త్రంలా ఉపయోగపడుతుంది. –ఎ పైడిబాబు, ఏలూరు త్రీటౌన్ ఎస్ఐ -
ఆరు నిమిషాల్లోనే దొంగను పట్టేశారు!
సాక్షి, ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) సత్ఫలితాలిస్తోంది. ఈ విధానంతో ఏలూరు సత్రంపాడులోని ఒక ఇంటిలో చోరీకి పాల్పడిన దొంగను కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో తొలిసారిగా ఎల్‌హెచ్‌ఎంఎస్ టెక్నాలజీతో దొంగను పట్టుకున్న కేసు ఇదే. ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తాడేపల్లిగూడెం కోర్టులో పనిచేస్తున్న వైఎల్ఎన్ మూర్తి ఏలూరు సత్రంపాడులో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబంతో తిరుపతికి వెళ్తూ ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు మార్చి 29న త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మూర్తి ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 1న అర్ధరాత్రి 12.30 గంటలకు శొంఠి దుర్గారావు అనే దొంగ ఇంటిలోకి ప్రవేశించడంతో సీసీ కెమెరాలో అతడి కదలికలు నమోదయ్యాయి. దీంతో 12.31 నిమిషాలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. వెంటనే పోలీస్ అధికారులు స్పందించి స్థానిక అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. 12.37 నిమిషాలకు ఎస్ఐ పైడిబాబు, కానిస్టేబుల్ సతీశ్‌లు సంఘటనా స్థలానికి వెళ్లగా దొంగ పారిపోయేందుకు ప్రయత్నించడంతో వెంటపడి పట్టుకున్నారు. రూ.వెయ్యి నగదుతోపాటు, యునికార్న్ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుడే.. సత్రంపాడులో దొరికిపోయిన దొంగ పాత నేరస్తుడుగా పోలీసులు గుర్తించారు. మచిలీపట్నంకు చెందిన శొంఠి దుర్గారావు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాడు. అతడి నుంచి పోలీసులు రూ.వెయ్యి, యూనికార్న్ బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దుర్గారావు వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నాడని, అతడిపై గతంలో బాపట్ల, గుడివాడ, మచిలీపట్నం, గుంటూరులో చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులకు అభినందనలు ఎల్‌హెచ్‌ఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా తన ఇంట్లో సొత్తు కాపాడుకోగలిగానని కోర్టు ఉద్యోగి మూర్తి అన్నారు. తమ మొబైల్ ద్వారా ఇంట్లో దొంగ కదలికలు చూడగలిగామని చెప్పారు. పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.