ఇంటికి తాళం.. ఎల్‌హెచ్‌ఎంఎస్‌దే భారం..! | Police Department Launches LHMS In Chittoor Two Years Ago To Curb Thefts | Sakshi
Sakshi News home page

ఇంటికి తాళం.. ఎల్‌హెచ్‌ఎంఎస్‌దే భారం..!

Published Sun, Oct 13 2019 1:10 PM | Last Updated on Sun, Oct 13 2019 1:10 PM

Police Department Launches LHMS In Chittoor Two Years Ago To Curb Thefts - Sakshi

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సెలవులు, బంధువుల ఇళ్లలో శుభకార్యాల సమయంలో చాలామంది బయట ఊర్లకు వెళ్లాల్సి వచ్చినపుడు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోతుంటారు. సాయంత్రం వెళ్లి.. ఉదయం తిరిగొచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో దొంగలు వారి హస్తకళను ప్రదర్శిస్తున్నారు. ఉన్నదంతా ఊడ్చేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఉచితంగా మన ఇంటిపై ఓ కన్నెసి ఉంచడానికి ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో సిద్ధంగా ఉన్నామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. 

సాక్షి, చిత్తూరు (అర్బన్‌): తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలను అరికట్టడానికి పోలీసు శాఖవారు జిల్లాలో రెండేళ్ల క్రితం ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్‌ హౌస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ప్రారంభించారు. అయి తే ఇప్పటికీ చాలా మంది దీన్ని ఉపయోగించుకోవడం లేదు. పోలీసులు ఇంటింటా తిరుగు తూ ప్రతి ఒక్కరూ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఉచితంగా వాడుకోమని వేడుకుంటున్నా.. కొందరు చెవికెక్కించుకోవడం లేదు. ఫలితంగా ఈ మధ్యకాలంలో చిత్తూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. దొంగలుపడ్డ ఆర్నెల్లకు పోలీసులు మేల్కొంటారనే నానుడిని చెరిపేస్తూ.. దొంగలు రాగానే పోలీసులు పట్టుకుంటున్నారనే పేరు తీసుకురావడానికి పోలీసు శాఖ ప్రయత్నిస్తున్నా.. ప్రజల సహకారం లేకపోతోంది. తాళం వేసిన ఇళ్లలో దొంగలు పడ్డ నిముషాల వ్యవధిలో వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ప్రాజెక్టు పనిచేస్తోంది. 

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
ముందుగా స్మార్ట్‌ ఫోన్‌ నుంచి గూగుల్‌ ప్లే స్టోర్‌కు వెళ్లాలి. ఇక్కడ ‘ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఏపీ పోలీస్‌’ అని టైప్‌ చేయాలి. ఏపీ పోలీస్‌ పేరిట ప్రత్యక్షమయ్యే ఓ అప్లికేషన్‌ కనిపిస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తరువాత వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామాతో పాటు ఇంట్లో కూర్చుని గూగుల్‌ మ్యాప్‌ను అటాచ్‌ చేయాలి. వెంటనే మనం ఇచ్చిన ఫోన్‌ నంబరుకు నాలుగంకెల వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. దీన్ని యాప్‌లో టైప్‌చేస్తే మన రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరువాత మన ఫోన్‌ నంబరుకు ఓ రిజిస్ట్రేషన్‌ నంబరు వస్తుంది. దీన్ని ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. ఇక ఎప్పుడైనా ఊరికి వెళుతున్నపుడు పోలీసులు ఇంటిపై నిఘా ఉంచాలనుకుంటే.. యాప్‌లోకి వెళ్లి ‘రిక్వెస్ట్‌ పోలీస్‌ వాచ్‌’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఎంచుకున్న తరువాత యూజర్‌ ఐడీ అడుగుతుంది. గతంలో సెల్‌ఫోన్‌కు వచ్చిన సంఖ్యను టైప్‌ చేయాలి. మనం ఎప్పుడు ఊరికి వెళ్లేది, సమయం, తిరిగి వచ్చే తేదీ, సమయం టైప్‌ చేసి సబ్‌మిట్‌ వాచ్‌ రిక్వెస్ట్‌పై క్లిక్‌ చేయాలి.

ఇలా పనిచేస్తుంది..
సబ్‌మిట్‌ వాచ్‌ రిక్వెస్ట్‌ పూర్తయిన తరువాత ఇంటికి పోలీసు కానిస్టేబుల్‌ వస్తారు. ఇంట్లో ఆలౌట్‌ మిషన్‌ను పోలి ఉండే ఓ మోషన్‌ కెమెరాను బిగించిన తరువాత మనం ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవచ్చు. అప్పటి వరకు కెమెరా పనిచేయదు. ఎప్పుడైతే దొంగ లోనికి ప్రవేశిస్తాడో ఆ కదలికల ద్వారా కెమెరా ఆన్‌ అవుతుంది. ఒక్కసారి కెమెరా ఆన్‌ కాగానే జిల్లా ఎస్పీకు, కమాండెంట్‌ కంట్రోల్‌ గదిలో అనుసంధానం చేసిన టీవీలోకి లైవ్‌ ప్రత్యక్షం అవుతుంది. అలారమ్‌ ద్వారా బ్లూకోట్‌ పోలీసుల నుంచి ఎస్పీ వరకు అలెర్ట్‌ చేస్తుంది. ఇక నేరుగా పోలీసులు వచ్చి దొంగను పట్టుకెళుతారు. ఒక వేళ ఇంటి యజమాని సైతం దీన్ని చూడాలనుకుంటే పోలీసులు దానికి తగ్గ ఆప్షన్‌ను ఇస్తారు. ఇందుకు కావాల్సిన కెమెరాలు రాష్ట్ర పోలీసు శాఖ నుంచి అందుతాయి. ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 

స్పందించాలి మరి..
చిత్తూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో 2016లో 53,993 మంది వారి ఇళ్లకు తాళాలు వేసుకుని బయట ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒక్కరు కూడా పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారమివ్వలేదు. 2017లో 1.10 లక్షల మంది, 2018లో  85,671 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40వేలకు మందికి పైగా ఇళ్లకు తాళం వేసినా పోలీసులకు ఎలాంటి సమాచారమివ్వలేదు. ఇదే సమయంలో గత మూడేళ్లుగా 17,850 మంది ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కోసం రికెస్ట్‌ పెడితే... వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఉచితంగా కెమెరాలను ఏర్పాటు చేయడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement