స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న సీపీ టీకే రాణా
సాక్షి, భవానీపురం(విజయవాడ పశ్చిమ): అన్నం పెట్టే సంస్థకే కన్నం వేసిన వ్యక్తి ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నాడు. విజయవాడ కృష్ణలంక రాణీగారితోటకు చెందిన శిరికొండ జయచంద్రశేఖర్ (25) తాను పనిచేస్తున్న సంస్థలోనే దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగినట్లు వచ్చిన సమాచారం తర్వాత కేవలం 2 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరానికి సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా శనివారం సాయంత్రం తన కార్యాలయంలో వెల్లడించారు.
నమ్మకంగా పనిచేస్తూ..
విజయవాడ బందరు రోడ్‌లోని అట్టికా గోల్డ్ షాపులో జయచంద్రశేఖర్ కొంత కాలంగా పని చేస్తున్నాడు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు రెండు నెలల క్రితం ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలో 45 రోజుల క్రితం సంస్థ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సిబ్బంది భోజనం చేసే సమయంలో లాకర్ తాళాలు దానికేపెట్టి ఉండటంతో.. జయచంద్రశేఖర్ లాకర్ తాళంతోపాటు మెయిన్ డోర్ షట్టర్ తాళం, బిల్డింగ్‌కు కింద వేసే తాళం తీసుకుని పీవీపీ మాల్ సమీపంలో మారు తాళాలు తయారుచేసే షాపునకు వచ్చి.. నకిలీ తాళాలు తయారు చేయించి, పావు గంట వ్యవధిలో తిరిగి అసలు తాళాలను వాటి స్థానంలో పెట్టేశాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వివిధ బ్రాంచిల నుంచి తీసుకువచ్చిన బంగారం, వెండి, నగదు లాకర్‌లో పెట్టడాన్ని గమనించాడు.
పక్కా స్కెచ్‌తో..
ఆ రోజు సాయంత్రం షాపు కట్టేసి వెళ్లిపోయిన తర్వాత రాత్రి 1.30 గంటల సమయంలో మారు తాళాలతో ముందు కింది గేటు తాళం, తర్వాత రెండో అంతస్తులో ఉన్న మెయిన్ డోర్ తాళం తీశాడు. దొంగలు బలవంతంగా పగుల కొట్టారని నమ్మించేందుకు తాళం కప్పను రాయితో పగులకొట్టాడు. మారు తాళంతో లాకర్ తెరిచి అందులో ఉన్న రూ.60 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండిని తనతో తెచ్చుకున్న రెండు బ్యాగుల్లో సర్దుకున్నాడు. అక్కడి నుంచి షట్టర్‌ను దించి దొంగిలించిన సొమ్మును ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. ఆ తర్వాత సొమ్మంతటినీ ఒకే బ్యాగ్‌లో సర్దేసి.. శనివారం ఉదయం తన స్నేహితుడు నాగేంద్ర (పాల వ్యాపారి)కు ఫోన్ చేశాడు. అతను బయట ఉన్నానని చెప్పడంతో.. ఆఫీస్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ బ్యాగ్ తన వద్ద ఉందని, దానిని మీ ఇంట్లో పెడుతున్నానని చెప్పి.. నాగేంద్ర తల్లికి ఆ బ్యాగ్ ఇచ్చి యథావిధిగా షాపునకు వచ్చేశాడు.
రెండు గంటల్లోనే..
శనివారం ఉదయం షాపు తెరిచేందుకు ప్రయత్నించిన యాజమాన్యం తాళాలు పగలగొట్టి ఉండటంతో, విషయాన్ని ఆ సంస్థ హెడ్ ఆఫీస్‌కు తెలియజేసి, మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో ఈస్ట్ డీసీపీ హర్షవర్ధన్‌రాజు పర్యవేక్షణలో సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా సేకరించిన ఆధారాలు, సీసీ ఫుటేజ్, షట్టర్, లాకర్ తెరవబడిన విధానాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనేనని భావించి.. దర్యాప్తు ప్రారంభించారు.
పట్టించిన వస్త్రాలు..
నిందితుడు దొంగతనం చేసే క్రమంలో సీసీ టీవీపై దుప్పుటి కప్పాడు. ఆ సమయంలో అతను వేసుకున్న దుస్తులను ఆ సంస్థ యాజమాన్యం గుర్తించింది. అది జయచంద్రశేఖర్ ఒక సారి షాపునకు వేసుకొని వచ్చాడని స్పష్టం చేసింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో నిందితుడు తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాక సీసీటీవీపై కప్పిన దుప్పటిపై నిందితుడి వేలిముద్రలు ఉండటంతో దొంగతనం చేసింది అతనే అని నిర్ధారించారు. ఆ తర్వాత అతని స్నేహితుని ఇంటి వద్ద ఉంచిన బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment