సాక్షి, అమరావతి: పోలీస్ అమరవీరుల సంస్మరణదినం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించనున్నారు. ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి 31 వరకు విజయవాడలో ‘ఓపెన్ హౌస్’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. అక్టోబర్ 24 నుంచి 27వరకు పోలీసు ఉద్యోగుల పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, 28న జిల్లా, రాష్ట్ర పోలీస్ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
పోలీసుల సంక్షేమానికి పెద్దపీట
పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వారి వైద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ..ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీతోపాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని కల్పించింది. గతేడాదిలో 11,486 మంది పోలీసు కుటుంబాలు నగదు రహిత విధానంలో రూ.42.40 కోట్ల విలువైన వైద్య సేవలను పొందాయి. పోలీస్ శాఖ భద్రతా పథకం ద్వారా పోలీసులకు రుణాలు అందిస్తోంది.
ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణ రుణాలు రూ.98.85 కోట్లు, ఉన్నత చదువుల కోసం రూ.11.66 కోట్లు, వివాహ రుణాలు రూ.3.95 కోట్లు, వ్యక్తిగత రుణాలు రూ.99.20 కోట్లు మంజూరు చేసింది. పోలీస్ ప్రమాద బీమా పథకం కోసం ఎస్‌బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎస్‌బీఐ ఖాతా ఉన్నవారికి రూ.40 లక్షలు, యాక్సిస్ ఖాతా ఉన్నవారికి రూ.60 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా ఉన్నవారికి రూ.70 లక్షలు బీమా పరిహారం కోసం ఒప్పందాలు చేసుకుంది. బీమా పరిహార మొత్తాన్ని రూ.85 లక్షలకు పెంచేందుకు ఆయా బ్యాంకులతో పోలీస్ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.
వాటితోపాటు సాధారణ మృతికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తోంది. సర్విస్‌లో ఉంటూ చనిపోయిన పోలీసుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకం కింద పోస్టింగులు కల్పిస్తోంది. గతేడాదిలో 244 మంది పోలీసులు చనిపోగా వారిలో 186 కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హులైన 436 మందికి ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన ధరఖాస్తులు పలు దశల్లో ఉన్నాయి. వారికి కూడా త్వరలోనే ఉద్యోగాలు కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment