పార్టీ మారొద్దని మీ నాన్నకు చెప్పవా..
ఎమ్మెల్యే మంచిరెడ్డి కుమారుడికి లోకేశ్ విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణలో వలసబాట పడుతున్న టీటీడీపీ ఎమ్మెల్యేలను నిలువరించే బాధ్యతను అధినేత చంద్రబాబు తనయుడు లోకే్శ్ తన భుజాలపై వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారన్న సమాచారం నేపథ్యంలో లోకేష్ మంగళవారం కిషన్‌రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నిం చారు. అయితే తాను స్వగ్రామమైన ఎలిమినేడులో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్నట్లు మంచిరెడ్డి చెప్పడంతో ఆయన తనయుడు, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్‌రెడ్డిని పార్టీ కార్యాలయానికి లోకే్శ్ పిలిపించారు. ‘మీ నాన్నను పార్టీ మారొద్దని చెప్పు. భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి’ అని సూచించినట్లు తెలిసింది. తన వంతుగా తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తానని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం. కాగా, మంచిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం హాల్ వద్ద కార్యకర్తల పేరిట కేసీఆర్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం.
కారెక్కడం ఖాయం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మంచిరెడ్డి కారెక్కడం దాదాపుగా ఖాయమైంది. మంగళవారం ఎలిమినేడులోని తన వ్యవ సాయ క్షేత్రంలో పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన ఆయన టీడీపీని వీడాలనే నిర్ణయానికొచ్చారు. టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయాన్ని మెజార్టీ నేతలు వ్యతిరేకించినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించిన టీడీపీకి దూరం కావద్దని మంచాల, యాచారం మండలాల నేతలు వారించారు. పనులు కావాలన్నా, నిధులు రావాలన్నా అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడమే ఉత్తమమని మరికొందరు నాయకులు స్పష్టం చేశారు.