ఎన్టీఆర్ బయోపిక్‌పై లోకేష్ కామెంట్
విజయవాడ: ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించబోతున్న సినిమాపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో బాలకృష్ణ కథనాయకుడిగా చేస్తే సినిమా చాలా బాగా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మామయ్య బాలకృష్ణ ఉండగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్‌పై మామయ్యే నిర్ణయం తీసుకున్నారని.. ఆయన నిర్ణయానికి తమ వైపు నుంచి అందరి సహకారం ఉంటుందన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడిగా వర్మ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తానే తెరకెక్కించబోతున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ఒక ఆడియో కూడా విడుదల చేశాడు.
కాగా ఎన్టీఆర్ చదివిన ఎస్ఆర్ఆర్ కళాశాలను అభివృద్ధి చేస్తామన్నారు. కళాశాల పరిస్థితి బాగలేదని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.