లోకేశ్‌కు సీనియర్ మంత్రుల షాక్
హైదరాబాద్ : ప్రభుత్వంలో పెత్తనం చలాయించాలనుకుంటున్న చినబాబు(నారా లోకేశ్)కు సీనియర్ మంత్రులు గట్టి షాక్ ఇచ్చారు. మీడియా లైజనింగ్ పేరుతో మంత్రులు, ప్రభుత్వంలో పెత్తనం చలాయించాలనుకున్న ఆయన ప్రయత్నాలకు గండి పడింది. 'మీడియా లైజినింగ్ ఈజ్ నథింగ్ బట్ నిఘా' అని చాలా మంది మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ అధికారుల వ్యవస్థ తమకు సమ్మతం కాదని చాలా మంది సీనియర్ మంత్రులు లోకేశ్ టీమ్‌కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మంత్రుల పేషీల్లో 20 మందిని మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించాలని లోకేశ్ బాబు ప్రతిపాదించారు.
అయితే చినబాబు పుట్టకముందు నుంచే పార్టీలో ఉంటున్న తమపై నిఘా ఏంటని సీనియర్ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు మీడియా లైజనింగ్ అధికారుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. 'మా పనికి మేమే పీఆర్వోలమని చాలా మంది చంద్రబాబు ముందుకు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. మరికొంత మంది మంత్రులు సొంత మనుష్యుల్నే పీఆర్వోలుగా పెట్టుకున్నారు. అవసరమైతే వారినే మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించుకోవాలని ప్రతిపాదించారు. మొత్తానికి లోకేశ్ లైజనింగ్ బెడిసి కొడుతోంది. అలాగే సీసీ కెమెరాల ప్రతిపాదనను కూడా మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.