లండన్‌లో ఘోరం.. 30 ఏళ్ల బానిసత్వానికి విముక్తి
లండన్ : ముగ్గురు మహిళలను అమానుషంగా చూస్తూ,బాహ్య ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా 30 ఏళ్లుగా బానిసలుగా కొనసాగిస్తున్న దంపతులను అరెస్ట్ చేసి ఆ మహిళలకు విముక్తి ప్రసాదించిన సంఘటన దక్షిణలండన్లోని లాంబెట్లో జరిగింది. భారత సంతతికి చెందిన మహిళ సారథ్యంలోని ఓ స్వచ్ఛందసంస్థ ఇచ్చిన సమాచారంతో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆ మహిళలను గత అక్టోబర్ 25న చెరనుంచి విడిపించారు. ఈ కిరాతక సంఘటనలో నిందితులైన దంపతులను ఈనెల 21న అరెస్ట్ చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.వివరాలిలా ఉన్నాయి. మలేషియాకు చెందిన 69 ఏళ్ల మహిళ, ఐర్లాండ్‌కు చెందిన మరో57 ఏళ్ల మహిళ, బ్రిటన్‌కు చెందిన 30 ఏళ్ల ఇంకో యువతి ఆ దంపతుల చెరలో బానిసలుగా మగ్గుతున్నారు. అనితా ప్రేమ్ అనే ఫ్రీడమ్ చారిటీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు బానిసబతుకునీడుస్తున్న ఐర్లాండ్ మహిళతో సాగించిన ఫోన్ సంభాషణ ఆధారంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.కాగా 67 ఏళ్ల ఆ దంపతులు బ్రిటన్ జాతీయులు కాదని అనిత చెప్పారు.
ఇంత సుదీర్ఘకాలం ఈ వ్యవహారం వెల్లడికాకుండా ఆ ఇంట్లో ఎలా ఉండగలిగారో విచారించాల్సి ఉందన్నారు.నిత్యం అత్యంత బిజీగా ఉండే ఈ నగరంలో పక్కింట్లో ఎవరుంటున్నారో మనకు తెలియదని ఆమె తెలిపారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరింట్లోనైనా పనిమనుషులుగా మగ్గుతున్నారో తెలుసుకోవడమే తమ సంస్థ పని అని అనిత వివరించారు.ఐర్లాండ్ మహిళ తమతో రహస్యంగా ఫోన్లో మాట్లాడడంతో ఈ దారుణం వెలుగులోకి తీసుకురాగలిగానని ఆమె చెప్పారు.ఆ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ముగ్గురు మహిళలు ధైర్యంగా బయటపడ్డారని ఆమె తెలిపారు.వారిని పునరావాస శిబిరానికి తరలించి కౌన్సెలింగ్ చేస్తున్నామని ఆమె చెప్పారు.బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా 30 ఏళ్లుగా వాళ్లు ఇంట్లోనే ఉండిపోయారని పోలీసులు తెలిపారు.బాధితుల నుంచి సమాచారం సేకరించడానికి కొంత సమయం పడుతుందని వారు చెప్పారు.