ఆన్ లైన్లో అమ్మకానికి నియంత వస్తువులు..!
లండన్: జర్మనీ నియంతగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన కొన్ని కోడింగ్ మేషిన్లను అమ్మకానికి పెట్టారు. యూకేలోని బ్లెక్లే పార్క్ నేషనల్ కంప్యూటింగ్ మ్యూజియం వాలంటీర్లు ఆన్ లైన్ మార్కెట్ ఈ-బే లో ఈ లోరేంజ్ మేషిన్లను గుర్తించారు. ఇవి జర్మనీకి చెందిన కోడింగ్ వస్తువులని, వాటి ధర దాదాపు రూ.100గా ట్యాగ్ పెట్టినట్లు తెలిపారు. ఈ-బే లో ఓ వస్తువు కోసం తనతోటి ఉద్యోగి వెతుకుతుండగా జర్మనీకి చెందిన లోరెంజ్ టెలీ ప్రింటర్ ను గుర్తించారని మ్యూజియం వాలంటీర్ జాన్ వెట్టర్ పేర్కొన్నాడు.
నాజీ పార్టీ వారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వీటిని వాడినట్లు అభిప్రాయపడ్డాడు. లోరెంజ్ ఎస్.జెడ్ 42 మెషిన్ హిట్లర్ వాడినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో దాదాపు 200కు పైగా ఉండేవని, ప్రస్తుతం నాలుగు మాత్రమే లభ్యమయ్యాయని చెప్పారు. అయితే ఈ టెలీప్రింటర్ల సహాయంతో జనరల్ అధికారులతో హిట్లర్ సంభాషించేవాడని, వీటి ఉనికి 1970 దశకంలో మొదటగా వెలుగులోకి వచ్చిందని స్థానిక మీడియాతో కథనాలు వచ్చాయి. అయితే సీక్రెట్ కోడింగ్ ద్వారా వారు రహస్యాలపై చర్చించేవారు. నాజీ పార్టీకి చెందిన ప్రముఖులకు మాత్రమే వీటి వాడకం తెలుసునని యూకే అధికారులు అభిప్రాయ పడుతున్నారు.