బైక్ను ఢీకొన్న లారీ: ఇద్దరు దుర్మరణం
కమ్మపాళెం (కొడవలూరు) :
మితిమీరిన వేగంతో వస్తున్న ఓ లారీ ముందు వెళ్తున్న మోటార్ బైక్ను వెనుక నుంచి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన మండలంలోని కమ్మపాళెం ఫ్లైఓవర్ వంతెన వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. కమ్మపాళెం మజరా చంద్రశేఖరపురానికి చెందిన లగుతోటి చిట్టిబాబు (50), ఉల్లిగడ్డల వెంకటేశ్వర్లు అలియాస్ చిన్నా (45) స్నేహితులు. ఆదివారం కావడంతో చిట్టిబాబు ఉదయం చికెన్ తీసుకువస్తానని భార్యకు చెప్పి బయలుదేరాడు. తనతో పాటు స్నేహితుడు చిన్నాను కూడా బైక్పై ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి కిమీ దూరం వచ్చాక కమ్మపాళెం ఫ్లైఓవర్ దాటగానే వెనుక నుంచి నెల్లూరు వైపు వేగంగా దూసుకొచ్చిన లారీ వారి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై నున్న ఇద్దరు రోడ్డుపై పడగా, వారి తలలు మీదుగా లారీ చక్రాలు ఎక్కాయి. ప్రమాదంలో చిట్టిబాబు, చిన్నా తలలు నుజ్జునుజై్జ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన లారీ అక్కడి నుంచి కిమీ దూరం వెళ్లాక బొడ్డువారిపాళెంం ఫ్లైఓవర్ వంతెన వద్ద నిలిపి వేసి లారీడ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న కోవూరు సీఐ మాధవరావు కొడవలూరు ఏఎస్ఐ వెంకటాద్రినాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చర్చికి రమ్మంటే.. :
చిట్టిబాబు మరణ వార్త తెలుసుకున్న భార్య లక్ష్మమ్మ బోరున విలపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకుంది. చర్చికి వెళ్దామని చిట్టిబాబును భార్య పిలిస్తే.. చికెన్ తెచ్చి ఇంట్లో పెట్టి వస్తానంటూ బయలు దేరిన నిమిషాల్లోనే ఘోరం జరిగిందంటూ రోదించడం అందరిని కంటతడి పెట్టించింది. చిట్టిబాబు, చిన్నా మంచి స్నేహితులని, ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారని, మరణంలోనూ కలిసే వెళ్లారంటూ రోదించడం కలచి వేసింది. చిట్టిబాబుకు వివాహమైన కుమార్తె ఉండగా, చిన్నాకు అవివాహితుడైన కుమారుడున్నట్లు వారి బంధువులు తెలిపారు. చిన్నా స్వగ్రామం కావలి కాగా, పదేళ్లుగా చంద్రశేఖరపురంలో స్థిరపడ్డారు. చిన్నా భార్య, కుమారుడు గ్రామంలో లేకపోవడంతో పోలీసులు చిన్నా మరణ సమాచారం అందించలేకపోయారు. చిన్నా సమీప బంధువులు మాత్రం సంఘటనా స్థలానికి చేరుకుని కంట తడిపెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మాధవరావు తెలిపారు.