బస్సును ఢీకొన్న లారీ
షాబాద్, న్యూస్‌లైన్: లారీ డ్రైవర్ అజాగ్రత్త పదిమంది క్షతగాత్రులవడానికి కారణమైంది. బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఆదివారం మండల పరిధిలోని షాబాద్ మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల నుంచి షాద్‌నగర్ వెళ్తోంది. చెన్నైకి చెందిన లారీ కెమికల్ లోడుతో కర్ణాటకకు ముంబై- బెంగళూరు లింకు రోడ్డు మీదుగా వెళ్తోంది. షాబాద్ మండల కేంద్రానికి సమీపంలో లారీ డ్రైవర్ అజాత్త్రతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు.
ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఏండీ సుల్తాన్, కండక్టర్‌తో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు కావలి రవి, జక్కని కళావతి, శోభ, రజిని, జయమ్మ, సరస్వతి, బాలమణి, వెంకటయ్యలకు గాయాలయ్యాయి. డ్రైవర్ సుల్తాన్‌కు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని షాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంతో రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్దరించారు.