అమ్మాయి కోసం స్నేహితుడ్ని హత్య చేశారు!
న్యూఢిల్లీ: ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో యువకుడ్ని కొంతమంది స్నేహితులు కొట్టి చంపిన ఘటన ఢిల్లీలోని కంజావాలాలో కలకలం సృష్టించింది. దీపక్ గులియా (19 ) అనే యువకుడు సోన్ పేటలో హాస్టల్ లో ఉంటూ ఓ స్కూళ్లో చదువుతున్నాడు. అయితే గత వేసవి సెలవుల నుంచి ఓ అమ్మాయి(17) విషయంలో స్నేహితులతో వివాదాలు నెలకొన్నాయి. ఆ యువతితో దీపక్ చనువుగా ఉండటం భరించలేని అతని క్లాస్ మేట్స్ ద్వేషం పెంచుకున్నారు. అతన్ని అంతమొందించాలని ప్రణాళిక రచించిన స్నేహితులు ప్రశాంత్ విహార్ లో బర్త్ డే పార్టీకి హాజరైన దీపక్ ను కిడ్నాప్ చేశారు. అనంతరం దీపక్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లి దండ్రులు నరేలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల క్రితం స్నేహితుల పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్లిన దీపక్ ఆ తరువాత కనిపించ లేదంటూ తండ్రి కృష్ణ దీపక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీనిపై అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బర్త్ డే వేడుకకు పిలిచిన అతని స్నేహితుల ఫోన్ నెంబర్లకు కాల్ చేసినా స్పందన కరువైంది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం మదనపూర్ దబ్బాస్ గ్రామంలో పొదల్లో ఓ యువకుడి మృతదేహం ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ యువకుడి మృతదేహం దీపక్ దే అని గుర్తించిన పోలీసులు అతని తల్లి దండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీటి పర్యంతమైయ్యారు. ప్రస్తుతం పరారీలో దీపక్ స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.