కింగ్‌ఫిషర్ బాటలోనే స్పైస్‌జెట్?
విమానంలో ప్రయాణమే కాదు.. విమానాలు నడిపే వ్యాపారం కూడా తీవ్ర ఒడిదుడుకుల్లోనే ఉంటోంది. ఇప్పటికే తీవ్ర నష్టాల బారిన పడి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ మూతపడగా, ఇప్పుడు అదే బాటలో స్పైస్‌జెట్ కూడా నడుస్తోంది. దాంతో అందులో పనిచేసే ఉద్యోగులు గుండెలు అరచేతుల్లో పెట్టుకుని ఒక్కో నెలా జీతం వచ్చిందంటే.. హమ్మయ్య అనుకుంటున్నారు. తక్కువ ఖరీదుకే విమానయానాన్ని అందిస్తున్న స్పైస్‌జెట్.. ఈసారి ఉద్యోగుల జీతాల నుంచి ఆదాయపన్నును మినహాయించినా, వారికి టీడీఎస్ సర్టిఫికెట్ గానీ, ఫారం-16గానీ ఇవ్వలేదు. దాంతో పన్నులు నిజంగానే ప్రభుత్వానికి కట్టారోలేదోననే అనుమానాలు వస్తున్నాయి. ఆదాయపన్ను రిటర్నులను దాఖలుచేయడానికి గడువు మరో మూడురోజుల్లో ముగుస్తుండగా, తమకు ఫారం-16లు ఇవ్వాలంటూ ఉద్యోగులు ఎన్ని ఈ మెయిల్స్ పెట్టినా స్పందన ఉండట్లేదు.
విదేశాలకు వెళ్లినందుకు పైలట్లకు ప్రత్యేక అలవెన్సు వస్తుంది. కెప్టెన్లకు అయితే రూ. 1.2 లక్షలు, కో-పైలట్లకు అయితే రూ.80వేల చొప్పున రావాలి. కానీ ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన ఈ సొమ్ము కూడా ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. సాధారణంగా ఏ సంస్థ అయినా ఉద్యోగుల ఆదాయపన్ను చెల్లించలేదంటే.. అది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనడానికి మొదటి నిదర్శనం.
కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూపు యాజమాన్యంలో నడుస్తున్న స్పైస్‌జెట్ ఇప్పుడు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి. సన్ గ్రూపునకు ఈ ఎయిర్‌లైన్స్‌లో 53.48శాతం వాటా ఉంది. మొట్టమొదట దీన్ని మోడీలుఫ్ట్ అనే పేరుతో ఎస్కే మోడీ ప్రారంభించి, 1996లో మూసేశారు. తర్వాత రాయల్ ఎయిర్వేస్గా కొన్నాళ్లు నడిచింది. 2004లో సంజయ్ మల్హోత్రా, అజయ్‌సింగ్ దీని యాజమాన్యాన్ని తీసుకున్నారు. 2008లో విల్బర్ రాస్, 2010లో కళానిధి మారన్ల చేతికి ఇది వచ్చింది.