'మహారాష్ట్ర కంటే మంగోలియా లక్కీ'
ముంబై: మంగోలియాకు వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన విమర్శలు సంధించింది. అంతటి అత్యుత్సాహాన్ని అప్పుల భారంతో కుంగిపోతున్న మహారాష్ట్ర రైతులకు ఆదుకోవడానికి ఎందుకు చూపించలేదని బుధవారం తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మండిపడింది. అంతపెద్ద మొత్తాన్ని అందుకోనున్న మంగోలియా మహారాష్ట్ర కంటే అదృష్టవంతురాలు అని ఎద్దేవా చేసింది.
‘ఇది చిన్న మొత్తం కాదు. దీంతో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్ర రైతుల ఆత్మలు మరింత బాధపడతాయి. రూపాయి మారకం ధర ఘోరంగా పడిపోతోంటే అంత భారీ మొత్తాన్ని ఇవ్వాల్సిన అవసరమేముంది?’ అని ప్రశ్నించింది. కాగా, శివసేన విమర్శలతో ఏకీభవిస్తున్నాని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు.