లిబియాలో ఘోర పడవ ప్రమాదం; 57 మంది మృతి!
ట్రిపోలీ: లిబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందినట్లు భావిస్తున్నామని యూఎన్ మైగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. పడవ పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం బయలుదేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారు.
దుర్ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇంజిన్లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలోనే పడవ ఆగిపోయిందని, ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోల్తాపడిందని తేలింది. ఐరోపాలో మెరుగైన జీవితం కోసం వలసదారులు, శరణార్థులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల్లో వలస వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో 500 వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు.. 18 మందిని ఈదుకుంటూ వచ్చి సోమవారం ఒడ్డుకు చేరుకున్నట్లు మెహ్లీ తెలిపారు.