ఫాస్ట్ బీట్తో సాహిత్యం కనుమరుగు
ఇప్పటి ఫాస్ట్‌బీట్ పాటలతో సాహిత్యం కనుమరుగవుతోందని ప్రముఖ నేపథ్యగాయిని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. అమలాపురం కామనగరువులోని ఆదిత్య పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవానికి శనివారం ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అప్పట్లో సాహిత్యానికి పెద్దపీట వేయడం వల్లే ఆనాటి పాటలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. నేటితరం పాటల్లో సాహిత్యం, సంగీత విలువలు తగ్గిపోయాయన్నారు. మరిన్ని సంగతులు ఆమె మాటల్లోనే..
1977లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి ‘మార్పు’ సినిమాలో పాటపాడే అవకాశం ఇచ్చారు. నాలుగు భాషలలో దాదాపు 5వేలకు పైగా పాటలు పడాను. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ గారి సూచన, కోరిక మేరకు సాగరసంగమం సినిమాలో నటించాను. అదే నా తొలి, ఆఖరి చిత్రం. నటనపై ఆసక్తిలేకే అవకాశాలు వచ్చినా నటించలేదు. కొన్ని సినిమాలకు మాత్రం డబ్బింగ్ చెప్పాను. క్లాసిక్‌లో సాగరసంగమంలో ‘వేదం అణువణువున నాదం’, మొండిమొగుడు పెంకి పెళ్లాం సినిమాలో ‘లాలూ దర్వాజ లస్కరు బోనాల్ పండుగకొస్తనని రాకపోతివి’ పాటలు నాకు బాగా గుర్తింపు తెచ్చాయి.
మాది నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట. మా తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతల.
ఇద్దరు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లం. మా తల్లిదండ్రులు కూడా గాయకులే. అన్నయ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి , నాకు ఆ వారసత్వమే వచ్చింది. నాకు గురువు అన్నయ్యే, గానంలో మెళకువలను ఆయననుంచే నేర్చుకున్నాను.స్వరం, శ్రుతి వస్తే ఎవరైనా పాటలు పాడవచ్చు. అలా సాధన చేస్తేనే మంచి గాయకులుగా రాణించవచ్చు.