శాల్యూట్ టు మండేలా
నెల్సన్ మండేలా చనిపోయిన తరువాత... ఆయన పోరాటాన్ని, తెగువను గుర్తుతెచ్చుకుంటూ కవులు కవితలు రాశారు. గాయకులు గొంతెత్తి పాడారు. తమదైన కోణంలో నుంచి కళాకారులు ఆ పోరాటయోధునికి నివాళులు అర్పించారు. చైనీస్ ఆర్టిస్ట్ ల్యు జియాంగ్మింగ్ కూడా తన స్పందనకు చిత్రరూపం ఇచ్చాడు. ఆయిల్ పెయింటింగ్‌లతో తన ఆరాధన భావాన్ని చాటుకున్నాడు. తాను గీసిన మూడు చిత్రాలకు ‘శాల్యూట్ టు మండేలా’ ‘చైనా అండ్ మండేలా’ ‘వరల్డ్ అండ్ మండేలా’ అని పేరు పెట్టుకున్నాడు.
‘శాల్యూట్ టు మండేలా’ ఆయిల్ పెయింటింగ్‌లో మండేలా పెదవులపై వినిపించే నవ్వు, చేతి వేళ్లు.. ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రియాశీలతను సూచిస్తాయి. అందులో ఉపయోగించిన ప్రతి వర్ణం స్వాతంత్య్రం, సమానత్వం, శాంతి భావాలను ప్రతిఫలిస్తాయి. మండేలా చుట్టూ ఉన్న ఐదు చేతివేళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిమానానికి ప్రతీకగా నిలుస్తాయి.
‘వరల్డ్ అండ్ మండేలా’లో చైల్డ్ హ్యాండ్ప్రింట్స్ కనిపిస్తాయి. చేతిలో వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. నిష్కల్మషమైన, పవిత్రమైన, అందమైన ప్రపంచాన్ని అది సూచిస్తుంది.
ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో పని చేసే జియాంగ్మింగ్కు మండేలా అన్నా, అతని భావజాలమన్నా చాలా ఇష్టం. ‘లాంగ్ మార్చ్’లో పాల్గొన్న సైనికుల పోర్ట్రెయిట్లను చిత్రించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు.
హార్లోడ్ రిలే గురించి కొంత...
ఆర్టిస్ట్ హార్లోడ్ రిలే తాను గీసిన డజను మండేలా చిత్రాలతో న్యూయార్క్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు ఎవరూ చూడని ఆ చిత్రాలను ‘వెరీ పర్సనల్’ అంటున్నాడు. ఒక పెయింటింగ్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘సౌత్ ఆఫ్రికన్ చిల్డ్రన్స్ చారిటీ’కి విరాళంగా ఇచ్చాడు.
జియాంగ్మింగ్లాగే హార్లోడ్ పెయింటింగ్లలోను అనేక ప్రతీకలు కనిపిస్తాయి. మండేలా అమితంగా అభిమానించే పుస్తకాలు, వార్తపత్రికలను ప్రతీకాత్మకంగా చూపాడు. కేవలం ప్రతీకలు మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా భౌగోళిక అందాలు కూడా ఆ పెయింటింగ్‌లతో కనువిందుచేస్తాయి.
చిత్రాలలో రంగులు మాత్రమే కాదు... మండేలా వ్యక్తిత్వం కనిపిస్తుంది. శాంతి పట్ల ఆయన ప్రేమ, ఈతరం పట్ల అభిమానం, ఆటల మీద ప్రేమ కనిపిస్తాయి. కొన్ని డ్రాయింగ్లలో మండేలా సంతకం కనిపిస్తుంది.