వీడిన ఉపాధ్యాయుడి హత్య మిస్టరీ
అనంతగిరి: ఉపాధ్యాయుడి హత్య మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్ కోసమే ఓ వ్యక్తి ఆయనను చంపేశాడు. పోలీసులు మృతుడి సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. వికారాబాద్ సీఐ లచ్చిరాంనాయక్ సోమవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
గత ఏప్రిల్ 28న వికారాబాద్ పట్టణంలోని హైదారాబాద్ మార్గం కొత్రేపల్లి గేట్ సమీపంలో అజీజ్‌నగర్‌లోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం. అనంతయ్య(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెం దాడు. అనంతయ్య స్వగ్రామం ధారూ రు మండలం జైదుపల్లి. ఆయన భార్య సుగుణతో కలిసి అజీజ్‌నగర్‌లోనే ఉండేవాడు. భూపంచాయితీ నేపథ్యంలో సుగుణ తన అన్నదమ్ములపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేసినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో వారు అనంతయ్య ఫోన్‌పై దృష్టి పెట్టారు. ఆయన వద్ద ఉన్న సామ్సంగ్ డ్యూయల్ ఫోన్ కనిపించకుండా పోయింది. అనంతయ్య ఫోన్లో కొంతకాలంగా ఎవరో వేరే సిమ్‌కార్డు వినియోగిస్తున్నారు. పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేశారు. నవాబ్‌పేట మండలానికి చెందిన ఓ వ్యక్తి సిమ్‌కార్డు పోయింది. దానిని వికారాబాద్ మండలం ధన్నారం అనుబంధ శ్రీరాంనగర్ తండావాసి రాత్లావత్ నరేష్ అనంతయ్య ఫోన్లో వేసుకొని ఉపయోగిస్తున్నాడు. పోలీసులు అనంతయ్య సెల్‌ఫోన్ ఐఎంఈఐపై దృష్టిపెట్టి నరేష్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
అనంతయ్య ఏప్రిల్ 27న తన తల్లి అనారోగ్యానికి గురవడంతో ఆమెను ఆస్పత్రికి చూయించేందుకు వికారాబాద్‌కు వచ్చాడు. సాయంత్రం వికారాబాద్ సమీపంలోని బురంతపల్లిలో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అక్కడ మద్యం తాగి అజీజ్‌నగర్ వెళ్లేందుకు కొత్రేపల్లి గేట్ వద్దకు వచ్చాడు. అక్కడ బస్సు కోసం నిరీక్షిస్తున్న అనంతయ్యను నరేష్ గమనించాడు. అనంతయ్య వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను ఎలాగైనా అపహరించాలని మద్యం మత్తులో ఉన్న నరేష్ భావించాడు. అనంతయ్య నుంచి అతడు సెల్‌ఫోన్ లాక్కునే సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.
ఈక్రమంలో నరేష్ అనంతయ్య నోరును అదిమి పట్టుకోవడంతో ఊపిరాడక మృతిచెందాడు. అనంతరం అతడు సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. కేసును సీసీఎస్ సీఐ సోమనాథ్, ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుళ్లు బాలునాయక్, శివలు చాకచక్యంగా ఛేదించారు. నిందితుడిని సోమవారం రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.