ఒంటెత్తు పోకడలతోనే ఒంటరైన విజయశాంతి
మెదక్ టౌన్, న్యూస్‌లైన్:
ఒంటెత్తు పోకడలతోనే ఎంపీ విజయశాంతి ఒంటరై పోయారని, ఆమెను కొత్తగా ఒంటరి చేయాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదని ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగాధర్, యువత రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చల్లా నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ఓనమాలు తెలియని విజయశాంతి కోసం ఉద్యమ నేత కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానాన్ని త్యాగం చేశారన్నారు. రాఖీ కట్టిన చెల్లెకు టీఆర్ఎస్లో ఇచ్చిన ప్రాధాన్యతను కేసీఆర్ ఎవరికీ ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్‌పార్టీతో దోస్తీ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. టీఆర్ఎస్పై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమించిన కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను విమర్శిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో, ఆమెపై ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆమెను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, కృషి ఫలితంగా రైల్వేలైన్ సాకారమైందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు శ్రీధర్‌యాదవ్, మున్నా, హమీద్, రాంచందర్, జీవన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.