‘దీర్ఘకాలిక’ టీచర్లపైప్రేమ!
సాక్షి, విశాఖపట్నం: ‘బదిలీ కౌన్సెలింగ్ ద్వారా పాఠశాలల్లో చేరి ఆరు మాసాలవుతోంది. ఇప్పటి వరకు జీతాల్లేవు. 16-18 ఏళ్లుగా ఒకే చోట ఉన్నవారికి వత్తాసుగా పాఠశాల విద్యాశాఖ అధికారులు, ప్రభు త్వ న్యాయవాది వ్యవహరిస్తున్నారు. మాకు కేటాయించిన స్థానాల్లో ఉన్న వారికి జీతాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నార’ంటూ.. జీవీఎంసీ పరిధిలో స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ చేసిన స్థానాల్లో చేరకుండా.. ట్రిబ్యునల్ ఉత్తర్వుల పేరిట పాత స్థానాల్లోనే కొనసాగుతున్నవారికి జీతాలు చెల్లించాలన్న అంశంపై ప్రాంతీ య సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ-కాకినాడ) ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఆది వారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
ఆ సమయంలో ఎక్కడ పనిచేశారు?
నిబంధనల మేరకు ఒకే చోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయినవారు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నా/లేకున్నా తప్పనిసరి బదిలీ కావాల్సిందే. 2009 నుంచి బదిలీల్ని తప్పించుకుంటున్న ఉపాధ్యాయుల్లో 57 మంది ఈ ఏడాది మేలో జరి గిన బదిలీల నుంచి మినహాయింపు కో రుతూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విష యం తెలిసిందే.
ఇందులో 22 మంది బ దిలీలకు దరఖాస్తు చేసుకుని కొత్త స్థానాలను కోరుకున్నారు. మిగిలిన 35 మంది కౌన్సెలింగ్‌కి హాజరుకాకపోవడంతో బదిలీ చేస్తూ గత డీఈవో కృష్ణవేణి మే 16న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 12 మంది స్థానాలు రేషనలైజేషన్‌లో రద్దయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందు పాత స్థానాలకు వెళ్లినా.. కొత్తవారు అప్పటికే విధుల్లోకి చేరడంతో వీరిని ఆయా స్కూళ్ల హెచ్ఎంలు అనుమతించలేదు.
జూలై 8న ట్రిబ్యునల్ ఉత్తర్వుల ఆసరాతో మళ్లీ పాత స్కూళ్లకు ఈ 35 మంది వెళ్లారు. జీతాల కోసం మళ్లీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. జిల్లా విద్యాశాఖ కౌంటర్‌కు అనుకూలంగా కృషి చేయాల్సిన ప్రభుత్వ న్యాయవాది(జీపీ) వీరికి వత్తాసుగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. స్వయంగా ఆయనే ట్రిబ్యునల్ ఉత్తర్వుల ఆధారంగా వారికి జీతాలివ్వాలంటూ.. పాఠశాల విద్యాశాఖకు లేఖ రాయడంపై ఉపాధ్యాయులు ఆక్షేపిస్తున్నారు. మే 16 నుంచి జూలై 7 వరకు పాత, కొత్త స్థానాల్లో ఎక్కడా వీరు పనిచేయలేదని సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.
వీరి జీతాల్ని పాత స్థానాల నుం చే చెల్లించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలపై ఎంఈవో కృష్ణదేవరాయలు ఇవే అభ్యంతరాల్ని అధికారుల ముందుంచా రు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో సమ స్య అలానే ఉండిపోయింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఉత్తర్వుల మేరకే ఆర్జేడీ ప్రసన్నకుమార్ ఎంఈవోలు, గత డీఈవోతోపాటు ఈ వ్యవహారంతో సం బంధమున్న వారిని పిలిచి ఆదివారం విచారణ జరిపారు.
అసలు సమస్య వదిలేశారు!
అసలు సమస్యను వదిలేసి.. ఏళ్లతరబడి ఒకే చోట కొనసాగుతున్నవారికి జీతాలిచ్చి.. వారిని మళ్లీ అక్కడే శాశ్వతంగా కొనసాగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కౌన్సెలింగ్‌లో బదిలీ అయి న వారికి గ్రామీణ ప్రాంతాల్లో 12 శాతం హెచ్ఆర్ఏతో జీతం, ఏళ్లతరబడి జీవీఎం సీ పరిధిని వీడకుండా ఉన్నవారికి 20 శా తం హెచ్ఆర్ఏతో జీతాల బిల్లులు పెట్టాలని సంబంధిత ఎంఈవోలకు ఆర్జేడీ సూచించడాన్ని ఏపీటీఎఫ్, వైఎస్సార్ టీఎఫ్ ప్రతినిధులు వెంకటపతిరాజు, చిరికి శ్రీనివాసరావు ఆక్షేపించారు. 16-18 ఏళ్లుగా ఒకే చోట ఉన్నవారికి 20 శాతం హెచ్ఆర్ఏతో ఎలా జీతాలిస్తారని ప్రశ్నించారు. తుది తీర్పు వచ్చేవరకు కొత్తస్థానాల్లో చేరిన 23 మంది ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లకుండా చర్యల్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు.