కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: శామీర్‌పేట ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌కు 15 మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ.. పదవి చేజారి పోతుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శామీర్‌పేటలో 29 ఎంపీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ 15, టీడీపీ 6, టీఆర్ఎస్ 5, బీజేపీ 2, ఒకరు సీపీఐ అభ్యర్థి గెలిచారు. అయితే ఈసారి ఎంపీపీ పీఠం బీసీ జనరల్‌గా రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి మండలంలోని శామీర్‌పేట ఎంపీటీసీ 1 నుంచి వి.సుదర్శన్, 2 నుంచి ఎం.రేణుకమహేందర్ యాదవ్, సునీత (యాంజాల్), బొబ్బిలి మంజుల యాదగిరి (జవహర్‌నగర్- 8)లు, టీడీపీ నుంచి తూంకుంట ఎంపీటీసీ చంద్రశేఖర్‌యాదవ్, అనంతారం నుంచి మల్లేశ్‌గౌడ్‌లు ఎంపీపీ పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరంతా మిగతా ఎంపీటీసీలతో బేరసారాలు చేస్తూ మంతనాలు కొనసాగిస్తున్నారు. శామీర్పేటకే ఎంపీపీ పదవి ఇవ్వాలని కొందరు నాయకులు పట్టుబడుతుండగా, జవహర్‌నగర్‌కు ఇవ్వాలని మరికొందరు నాయకులు పైరవీలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా శామీర్‌పేటకు కేటాయించినందున ఎంపీపీ పదవిని జవహర్‌నగర్‌కే కేటాయించాలని ఎంపీటీసీ సభ్యురాలు మంజుల పట్టుపడుతున్నారు. ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ జవహర్‌నగర్ ఎంపీటీసీ రంగుల సతీష్ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా జవహర్‌నగర్ గ్రామ టీఆర్ఎస్ ముఖ్యనాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ 5, టీడీపీ 6, బీజేపీ 2, సీపీఐ 1తో కలుపుకుని 14 మంది ఎంపీటీసీలు అవుతున్నారు. మెజార్టీ కోసం ఇంకొకరిని కాంగ్రెస్ పార్టీ నుంచి తమవైపు తిప్పుకొంటే ఎంపీపీ పీఠం తమకే దక్కుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాల కారణంగా 15 మంది ఎంపీటీసీలు ఏకతాటిపై లేనిపక్షంలో ఎంపీపీ పదవి చేజారే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరు చేజారకుండా నేడో, రేపో ఆ పార్టీ ముఖ్యనాయకులు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులతో సహా క్యాంపునకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.