సిస్టమిక్ ల్యూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ)
సిస్టమిక్ ల్యూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) అనే వ్యాధి వల్ల శరీరంలోని అనేక అవయవాలు ప్రభావితమవుతాయి. ఇది గుండె, చర్మం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్లు, రక్తనాళాలు, నాడీవ్యవస్థలను పీడిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. రోగనిరోధక వ్యవస్థలో సొంత కణాలపైనే దాడిచేయడం వల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది 15 - 35 ఏళ్ల వారి వరకు కనిపిస్తుంది. స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బు దిశను ఊహించడం కష్టం.
లక్షణాలు : ఈ వ్యాధికి గురయ్యే అవయవాన్ని బట్టి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
చర్మం: ముఖంపై దద్దుర్లు ముక్కుకు ఇరుపక్కలా చెంపలపై సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు (దీన్నే బటర్ఫ్లై రాష్ అంటారు)
మూత్రపిండాలు: ఎక్కువశాతం ఎస్ఎల్ఈ రోగులలో మూత్రపిండాల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. దీన్నే ల్యూపస్ నెఫ్రైటిస్ అంటారు మూత్రంలో రక్తకణాలు, ప్రోటీన్లు కోల్పోవడం శరీరమంతా వాపు రావడం, బరువు పెరగడం ఎస్ఎల్ఈ దీర్ఘకాలంలో మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి చేయాల్సిన అవసరం రావచ్చు. అందుకే వ్యాధి తీవ్రమయ్యాక చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది.
గుండె : ఎస్ఎల్ఈ రోగుల లో గుండెకు సంబంధించిన సమస్యలతో మరణించే వారి సంఖ్య అధికం. ముఖ్యంగా పెరికార్డైటిస్, మయోకార్డైటిస్, ఎండోకార్డైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటివల్ల ఆయాసం, జ్వరం, నీరసం మొదలైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఎస్ఎల్ఈ వల్ల గుండెలోని రక్తనాళాలలో కొవ్వుపదార్థాలు వేగంగా, అధికంగా పేరుకుపోవడం వల్ల గుండెనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.
నాడీవ్యవస్థ : ఎస్ఎల్ఈ బారినపడితే మానసిక అశాంతి, పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి గర్భిణులలో ఎస్ఎల్ఈ వల్ల పిండం మృతిచెందడం, గర్భస్రావం వంటివి జరిగే అవకాశం ఎక్కువ.
కారణాలు : శాస్త్రీయంగా ఎస్ఎల్ఈ వ్యాధికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే జన్యుపరమైన, పర్యావరణపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశాలున్నట్లు అనుభవపూర్వకంగా తెలుస్తోంది.
ఈ వ్యాధికి అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఏ వైద్యవిధానంలోనూ సంపూర్ణంగా నయం చేసే అవకాశం లేదు.
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్