పత్తి రైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలి
వైఎస్సార్సీపీ రైతు విభాగం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రెండేళ్లుగా పత్తి రైతు సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన విత్తనోత్పత్తి ధరను రైతులకు విత్తనకంపెనీలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. 2008-09 లో పత్తి క్వింటాలు ధర రూ. 6,500 ఉందని.. లాభసాటిగా ఉండడంతో సాగు విపరీతంగా పెరిగి పోయిందన్నారు. ఫలితంగా ఇపుడు కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. గతేడాది క్వింటాలు పత్తి ఉత్పత్తికిరూ. 5,760 వ్యయం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,900 మద్దతు ధర ప్రకటించిందని.. చివరికి రైతుకు వచ్చిన ధర రూ. 3,500 మాత్రమేనని వివరించారు. ప్రస్తుతం ఉత్పాదక వ్యయం క్వింటాలుకు రూ. 5,950 ఉంటే, మద్దతు ధర రూ. 4,000గానే ఉందన్నారు.
రైతుల వద్ద నుంచి 80శాతం పత్తి వెళ్లి పోయాక మార్కెట్ ధర రూ.5,000 దాటిందన్నారు. ఏటా ఇలాగే జరిగితే రైతుల పరిస్థితి ఏమిటని నాగిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తరువాత రాష్ట్ర ప్రభుత్వం బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ. 830 (బీజీ-1రకం), రూ. 930 (బీజీ-2రకం)కు పెంచేసిందని గుర్తుచేశారు. విత్తనోత్పత్తి రైతులకు రూ. 290 చెల్లించాల్సి ఉండగా విత్తన కంపెనీలు మాత్రం రూ. 70 వరకు కోత విధిస్తున్నాయని చెప్పారు. పత్తి రైతుల విషంయలో ఇలా జరుగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.