మూడో కంటికి తెలియకనే..
సాక్షి, తిరుపతి:
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా ఆయన నియామకం జరిగిపోయింది. కాంగ్రెస్ నేతలందరూ రాష్ట్ర విభజనకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారిస్తే మాజీ ఎమ్మెల్యే మాత్రం తుడా చైర్మన్ పదవిపై కన్నేసి మూడో కంటికి తెలియకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టడానికి కొద్ది గంటల ముందు మాత్రమే విషయం లీక్ అయింది. కాంగ్రెస్ పార్టీలో ఇలా జరగడం చాలా అరుదు.
నామినేటెడ్ పదవుల నియామకం దాదాపుగా ఉండదనుకుం టున్న సమయంలో వెంకటరమణ రాజధానిలో చక్రం తిప్పారు. తుడా చైర్మన్ పదవి 2010 నుంచి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో చివరి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీకాలం ముగిసే సమయంలో వెంకట రమణను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తుడా చైర్మన్ పదవి కోసం వెంకటరమణతో పాటు మాజీ మంత్రి ఆర్.చెంగారెడ్డి కుమార్తె ఇందిర ప్రియదర్శిని, మంత్రి గల్లా అరుణకుమారి వర్గానికి చెందిన ఎమ్మార్సీ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. వీరితో పాటుశ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ.నాయుడు సైతం ప్రయత్నించారు. అయితే కిందటి ఏడాది తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటరమణ ఇప్పుడు దానినే అస్త్రంగా ఎంచుకున్నారు. ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి నష్టపోయానని కనీసం తుడా చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద వాపోయినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సుముఖంగా లేనప్పటికీ వెంకటరమణ అభ్యర్థనను మన్నించి ఈ నియామకానికి మొగ్గు చూపినట్టు తెలిసింది. ప్రభుత్వానికి కాలం చెల్లనున్న సమయంలో కీలకమైన తుడా చైర్మన్ నియామకం రహస్యంగా చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది.
మూణ్ణాళ్ల ముచ్చటేనా?
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తుడా చైర్మన్‌గా నియమితులైనప్పటికీ వెంకటరమణకు ఈ పదవి మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు సంఘీభావంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా కాంగ్రెస్ ప్రముఖులు కూడా పదవులకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంకటరమణ తుడా చైర్మన్ పదవిని ఆశించడమే పొరబాటు నిర్ణయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పార్టీలో తన పట్టు సడలలేదని నిరూపించుకునేందుకు తమ నాయకుడు ఈ పదవిని తెచ్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే అనుయాయులు అంటున్నారు. కొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చుకోవడం కాని, ఉన్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం కానీ లేనందున తుడా చైర్మన్ పదవి కేవలం అలంకారప్రాయంగా మారనుందని తెలుస్తోంది. ఎవరి అభిప్రాయాలు, వాదనలు ఎలా ఉన్నా వెంకటరమణ మాత్రం పార్టీలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, రెండు సార్లు మున్సిపల్ వైస్ ైచె ర్మన్‌గా పనిచేసిన ఆయన 2004 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. అంతకుముందు 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పలు కీలక పదవులు అలంకరించిన వెంకటరమణ ప్రస్తుతం తుడా 12వ చైర్మన్‌గా నియమితులయ్యారు. గతంలో ఏ.మోహన్, భూమన కరుణాకరరెడ్డి తుడా చైర్మన్లుగా పనిచేసిన తరువాత శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వెంకటరమణ మాత్రం శాసనసభ్యునిగా పనిచేసిన తరువాత తుడా చైర్మన్‌గా నియమితులయ్యారు.