ఆ ఛాన్స్ వస్తే వదులుకోను: అనసూయ
మా మహాలక్ష్మి, తడాఖా, కిర్రాక్ వంటి టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అనసూయ మరో కొత్త అవతారం ఎత్తబోతోంది. సింగర్ గా ప్రేక్షకులను అలరించాలని ఆమె ఉవ్విళ్లూరుతోంది. ఓ ఫిచర్ సినిమాలో నటించేందుకు సిద్దమైన అనసూయ పాట పాడాలన్న తన కోరికను బయటపెట్టింది. అంతేకాదు తన కోరిక త్వరలోనే తీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
తనకున్న ఇష్టాల్లో పాట పాడడం ఒకటని వెల్లడించింది. పాట పాడే అవకాశం ఇవ్వాలని పలువురు సంగీత దర్శకులను కూడా ఆమె సంప్రదించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బృందంతో కలిసి ఇటీవల ఆమె అమెరికాలో పర్యటించింది. ఈ బృందం అమెరికాలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది. తనకు పాట పాడే అవకాశం వస్తే వదులుకోబోనని అనసూయ చెప్పింది. ఎవరో ఒకరు తనకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది.