పోర్ష్ మకన్ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ పోర్ష్ కంపెనీ కాంపాక్ట్ ఎస్యూవీ, మకన్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరలు రూ.69.98లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని అని పోర్ష్ ఇండియా తెలిపింది. భారత్‌లో అత్యధికంగా విజయవంతమైన మోడల్ ఇదేనని, ఈ కొత్త వేరియంట్‌కు కూడా మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని పోర్ష్ ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి చెప్పారు. ఈ కారును 2–లీటర్ల టర్బోచార్జ్డ్ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌తో రూపొందించామని, 252 హార్స్పవర్ శక్తిని ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని ఆరున్నర సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 227 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ మోడల్లో హై ఎండ్ వేరియంట్, మకన్ ఎస్‌ను కొత్త వీ6 ఇంజిన్‌తో రూపొందించామని, 354 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని వివరించారు. ఈ కారు ధర రూ.85.03 లక్షలని తెలిపారు. గత ఏడాది మొత్తం 348 కార్లను విక్రయించామని, ఈ ఏడాది కూడా అమ్మకాలు ఇదే రేంజ్లో ఉండగలవని పేర్కొన్నారు.
4 నిమిషాల్లోనే చార్జింగ్..
వచ్చే ఏడాది మే కల్లా ఎలక్ట్రిక్ కారు, టేకాన్‌ను భారత మార్కెట్లోకి తెస్తామని పవన్ శెట్టి తెలిపారు. ఇతర పోర్ష్ కార్ల మోడళ్లలాగే ఈ కారును కూడా పూర్తిగా తయారైన రూపంలోనే దిగుమతి చేసుకుంటామని చెప్పారు. ఈ కారు బ్యాటరీలను నాలుగు నిమిషాల్లోనే చార్జింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్లను చార్జింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడానికి భారత్‌లోని ఫైవ్–స్టార్ హోటళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. కాగా ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి, చార్జర్లపై పన్ను రేట్లను 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు. ఇది సానుకూల నిర్ణయమని పేర్కొన్నారు.