Macherla municipality
-
13న స్థానిక సంస్థల ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో విడత స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా స్థానిక సంస్థల్లో రాజీనామా లేదా మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు పరోక్ష పద్ధతిలో ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులతో పాటు పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవిని భర్తీ చేస్తారు. అలాగే మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీల్లో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మొత్తం 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో– ఆప్షన్ సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. వివిధ మండలాల్లో 12 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు కూడా ఎన్నికలు ఉంటాయని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటీసులను ఆయా స్థానిక సంస్థల సభ్యులకు ఈ నెల 9 కల్లా అందజేయాలని ఆదేశించారు. ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4) రామకుప్పం (చిత్తూరు), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజెర్ల (నెల్లూరు) కో– ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగే మండలాలు (3) చిత్తూరు, బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7) రామకుప్పం, విజయాపురం (చిత్తూరు), రాపూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం). ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు (12) అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి.. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున. -
మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం
మాచర్ల: కండీషన్ బెయిల్ పేరుతో టీడీపీ నేతలు మాచర్లలో అలజడి సృష్టించేందుకు మరోమారు విఫలయత్నం చేశారు. గత నెల 16వ తేదీన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం పేరుతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి 12వ వార్డులో ర్యాలీగా వెళ్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి ముగ్గురిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి మరో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న నిందితులందరూ కండీషన్ బెయిల్‌కు సంబంధించి పట్టణ పోలీసు స్టేషన్లో సంతకాలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆదివారం సంతకాలు చేసేందుకు బ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు వస్తున్న నేపథ్యంలో అలజడి సృష్టించాలని వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా మాచర్లకు తరలి రావాలంటూ వారి అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు 30 యాక్టు, 144 సెక్షన్ అమలు చేస్తూ నెహ్రూనగర్ నుంచి పట్టణ పోలీసు స్టేషన్ వరకు గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్, సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దీంతో ఇతరులు అక్కడికి వచ్చి అలజడి సృష్టించే అవకాశం లేకపోయింది. కేవలం బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే 12.30 గంటలకు బస్సులోంచి చేతులూపుతూ వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
టీడీపీ మహిళా నేత శ్రీదేవి ఆత్మహత్య
మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్, టీడీపీ మహిళా నేత శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నేటి ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీదేవి నేటి ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శ్రీదేవి మృతిచెందారు. మాచర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పనిచేసిన శ్రీదేవికి టీడీపీ పెద్దల నుంచి రాజకీయ ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ఆమె నాలుగు నెలల కిందటే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. చైర్ పర్సన్ పదవి పంపకాల విషయంలో శ్రీదేవి దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట ఆమె భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతిచెందారు. ఓ వైపు పదవి కోల్పోవడంతో పాటు భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీదేవి నేటి ఉదయం పరుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నం చేశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండీ: డామిట్.. కథ అడ్డం తిరిగింది..!)