ప్రలోభాలకు దిగుతున్న పచ్చపార్టీ
అనంతపురం: సీమాంధ్రలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీ పార్టీ నాయకులు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. పలు జిల్లాల్లో డబ్బుతో టీడీపీ కార్యకర్తలు పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. అనంతపురం జిల్లాలోని పుట్లూరు, గన్నెవారిపల్లిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ నలుగురు టీడీపీ కార్యకర్తలు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ. 72 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం ఎన్ఎస్ గేటు వద్ద జరిపిన తనిఖీల్లో రామగిరి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి చమన్ నుంచి రూ.2.03 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో తనిఖీలు నిర్వహించి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి మాదల ప్రభాకర్ నుంచి రూ.6.50 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
చిత్తూరు జిల్లాలో పుత్తూరులో ఓటర్లకు టీడీపీ నాయకులు మద్యం సీసాలు సరఫరా చేశారు. పైడిపాలెం, వేణుగోపాలపురంలో టీడీపీ కార్యకర్తలకు చెందిన 17 మద్యం కేసులను పోలీసులు పట్టుకున్నారు.
ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లిలో టీడీపీ కార్యకర్తల నుంచి 672 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.