టేప్ తళుకులు
వారం వారం ఎన్నో రకాల మేడ్ ఇన్ హోమ్ జ్యుయెలరీని చూస్తున్నాం. మనకు సులువుగా దొరికే వాటితో... ఇయర్ రింగ్స్, నెక్లేస్, బ్రేస్లెట్ల తయారీని తెలుసుకుంటున్నాం. ఈసారి వెరైటీగా కనిపించే... అనిపించే జ్యుయెలరీని చూద్దాం. పక్కనున్న ఫొటోల్లో కనిపిస్తున్న జ్యుయెలరీ మొత్తం టేపులతో తయారు చేసినవే. ప్రస్తుతం షాపుల్లో ఇవి వివిధ డిజైన్లలో దొరుకుతున్నాయి. పెద్ద ఖర్చేమీ లేకుండా.. సులువుగా ఉంటుంది వీటి మేకింగ్. ఎలా అంటే..
కావలసినవి: రంగురంగుల టేపులు (డిజైన్స్‌తో ఉన్నవి), కత్తెర, ఇయర్ రింగ్ హుక్స్, ఓల్డ్ బ్యాంగిల్స్, ఓల్డ్ మెటల్ రింగ్స్
తయారీ: ముందుగా టేప్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఫోల్డ్ చేస్తూ, ఒకదానికొకటి అతికించి ఓల్డ్ రింగ్‌కు చుట్టాలి. అలాకాకుండా, ఫొటోలో కనిపిస్తున్నట్టు పూర్తిగా టేప్తోనే రింగ్స్ తయారు చేసుకోవచ్చు. మరి ఇయర్ రింగ్స్‌ను తయారు చేసుకోవాలంటే... టేప్ ముక్కలను తీసుకొని, కత్తెర సాయంతో పక్షి ఈకల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వాటికి ఇయర్ రింగ్ హుక్స్ను తగిలించాలి. లేదా ఏదైనా అట్ట ముక్కను మీకు నచ్చిన షేపులో కట్ చేసి, ఈ టేప్‌ను అంటించి... వాటికి హుక్‌ను తగిలించాలి.
ఏ డ్రెస్సు కలర్‌కు మ్యాచ్ అయ్యేలా ఆ రంగు టేప్‌తో వీటిని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ టేప్‌ను డిజైన్‌గా కట్ చేసి మడిస్తే... చెయిన్‌కు లాకెట్గానూ మారిపోతుంది. అంతేకాదు... ఓల్డ్ బ్యాంగిల్స్‌కు కలర్‌ఫుల్ టేపులను చుడితే... అవి కొత్త గాజుల్లా మెరిసిపోతాయి. అలాగే పొడవు టేపును ఫోల్డ్ చేస్తూ... పూసలు గుచ్చితే అందమైన బ్రేస్లెట్ రెడీ అవుతుంది. ఇదే పద్ధతిలో చెయిన్లనూ తయారు చేసుకోవచ్చు.