Madhav Bhandari
-
'విడాకులు ఎప్పుడు ఇస్తారు?'
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు ముదురుతున్నాయి. రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది. తమ నుంచి విడిపోవాలని శివసేన పార్టీకి బీజేపీ బహిరంగంగా సవాల్ విసిరింది. తమ పార్టీ నుంచి ఎప్పుడు విడాకులు తీసుకుంటారని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ బండారి ప్రశ్నించారు. మహారాష్ట్ర బీజేపీ పక్షపత్రిక 'మనోగత్'లో 'తలాక్ ఎప్పుడు తీసుకుంటారు' పేరుతో రాసిన వ్యాసంలో శివసేనపై విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై కూడా విమర్శలు గుప్పించారు. నిజాం ప్రభువులా తమను అణచివేస్తున్నారని రౌత్ చేసిన వ్యాఖ్యలపై మాధవ్ మండిపడ్డారు. అణచివేతను గురువుతున్నామని చెబుతున్న శివసేన తమతో ఇంకా ఎందుకు కలిసివుందని ప్రశ్నించారు. దమ్ముంటే బీజేపీ విడాకులు ఇవ్వాలని సవాల్ చేశారు. 'నిజాం' ఇచ్చిన ప్లేటులో ఒక చేత్తో బిర్యానీ తింటూ, మరో చేత్తో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారా అని నిలదీశారు. తమ పార్టీతో కలిసివుంటునే విమర్శలు చేయడం సరికాదని మాధవ్ బండారి పేర్కొన్నారు. -
పాత సీసాలో పాత సారా: బీజేపీ
ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీల ఎన్నికల ప్రణాళికలు పాత సీసాలో పాత సారాయి లాగా ఉన్నాయని బీజేపీ ఎద్దేవా చేసింది. గతంలో చేసిన ఏ వాగ్దానాలనూ ఆ రెండు పార్టీలు నెరవేర్చలేదని బీజేపీ ప్రతినిధి మాధవ్ భండారీ విమర్శించారు. డిసెంబర్ 2012 నాటికే రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చిందని చెప్పారు. దహేజ్, ఉరాన్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ కోసం ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదని అన్నారు. శరద్ పవార్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలంలో 60వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భండారీ విమర్శించారు. ఉచిత విద్యుత్ అందచేస్తామన్న హామీతో కాంగ్రెస్, ఎన్సీపీలు 2004 ఎన్నికల్లో గెలుపొందారని, తిరిగి ఈసారి కూడా అవే హామీలు ఇస్తున్నారని అన్నారు. వారి మేనిఫెస్టోల్లో కొత్త అంశాలేవీ కనిపించడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రాంతీయ అసమానతలను తొలగిస్తామని చెప్పారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని అన్నారు. -
సీట్ల కోసం కొట్లాట వద్దు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగుందని,అంతా కలిసికట్టుగా పోటీచేసి అధికారం తెచ్చుకుందామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనవసరంగా సీట్ల కోసం పోట్లాడడం ఎందుకన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బీజేపీకి 135 స్థానాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ, శివసేన కూటమిని అప్పట్లో వాజ్‌పేయి, అద్వానీ, శివసేన దివంగత అధిపతి బాల్‌ఠాక్రే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ‘25 సంవత్సరాలుగా ఈ కూటమి చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుంది’ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇకమీదట ఆచితూచి మాట్లాడతానన్నారు. మోడీపై వ్యాఖ్యలను సహించబోమని బీజేపీ నేత మాధవ్ భండారీ పేర్కొనడంపై స్పందిస్తూ ఆయన అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. అందువల్ల ఈ అంశంపై ఏమీ మాట్లాడదల్చుకోలేదన్నారు. బీజేపీని తానేనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. పొత్తు గురించి ప్రశ్నించగా ప్రతి సమస్యకు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయం ఓ కొలిక్కి వస్తుందన్నారు. తమ వల్లనే మోడీ లాభపడ్డారని తానేనాడూ అనలేదన్నారు. దేశ పరిస్థితులపైనే మాట్లాడానన్నారు.