సీట్ల కోసం కొట్లాట వద్దు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగుందని,అంతా కలిసికట్టుగా పోటీచేసి అధికారం తెచ్చుకుందామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనవసరంగా సీట్ల కోసం పోట్లాడడం ఎందుకన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బీజేపీకి 135 స్థానాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ, శివసేన కూటమిని అప్పట్లో వాజ్‌పేయి, అద్వానీ, శివసేన దివంగత అధిపతి బాల్‌ఠాక్రే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ‘25 సంవత్సరాలుగా ఈ కూటమి చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుంది’ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఇకమీదట ఆచితూచి మాట్లాడతానన్నారు. మోడీపై వ్యాఖ్యలను సహించబోమని బీజేపీ నేత మాధవ్ భండారీ పేర్కొనడంపై స్పందిస్తూ ఆయన అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. అందువల్ల ఈ అంశంపై ఏమీ మాట్లాడదల్చుకోలేదన్నారు. బీజేపీని తానేనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. పొత్తు గురించి ప్రశ్నించగా ప్రతి సమస్యకు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయం ఓ కొలిక్కి వస్తుందన్నారు. తమ వల్లనే మోడీ లాభపడ్డారని తానేనాడూ అనలేదన్నారు. దేశ పరిస్థితులపైనే మాట్లాడానన్నారు.